Washington: ట్రంప్ వీసా ఫీజు పెంపు ఎఫెక్ట్… అమెరికా వర్సిటీలకు తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1బీ వీసా ఫీజు పెంచి టార్గెట్ చేయడంతో.. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.ముఖ్యంగా ఫీజుల పెంపు మొదలుకుని.. సోషల్ మీడియాలో పోస్టులపైనా పరిశీలన జరుపుతూ వణికిస్తుండడంతో.. విద్యార్థులు, తల్లితండ్రులు అమెరికా వెళ్లాలనుకునే ఆశల్ని వదులుకుంటున్నారు. అమెరికా స్థానంలో యూరోపియన్ దేశాల్లో చదువులను అన్వేషిస్తున్నారు. ఆగస్టులో ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది.
ట్రంప్ (Donald Trump) చర్యల నేపథ్యంలో ఆగస్టులో విదేశీ విద్యార్థులకు జారీచేసే వీసాల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19శాతం తగ్గింది. కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదల కావడం గమనార్హం. ఇక భారతీయ విద్యార్థుల విషయానికొస్తే 44 శాతం మేర క్షీణత కనిపించింది (Indian student visas). సాధారణంగా యూఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి అగ్ర దేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా, ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది. మరోవైపు.. చైనా విద్యార్థులకు యూఎస్ 86,647 వీసాలు జారీ చేసింది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం.
ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా (USA) రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగును తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వెట్టింగ్ కోసం వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్‌లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే ‘సోషల్ మీడియా వెట్టింగ్’ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అయితే తర్వాత వీసా ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపిస్తున్నాయి.