అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో… భారీ పేలుడు
అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో భారీగా హైడ్రోథర్మల్ పేలుడు సంభవించింది. దాని తీవ్రత దెబ్బకు అక్కడున్న పర్యటకులు పరుగులు తీశారు. ప్రకృతిలో మార్పుల కారణంగానే అది జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్‌లోని బిస్కట్ బేసిన్ అనే ప్రాంతంలోని పార్కింగ్, బోర్డ్ వాక్ సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకొంది. సందర్శకులు ఆ చెరువు సమీపంలో నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కొన్ని వందల మీటర్ల ఎత్తులో నీరు, ఆవిరి ఎగిసిపడ్డాయి. అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా వారికి అర్థం కాలేదు. తొలుత బాంబుగా భ్రమించి పరుగులు తీశారు. మరోవైపు అమెరికా భూభౌతిక సర్వే విభాగం మాత్రం దీనిని హైడ్రోథర్మల్ పేలుడుగా చెబుతోంది. భూమి అడుగున ఉన్న నీరు వేగంగా వేడెక్కి ఆవిరిగా మారడంతో ఒత్తిడి పెరిగి భయంకరమైన పేలుళ్లు జరుగుతాయని పేర్కొంది. ఆ సమయంలో నీరు, నీటి ఆవిరి, బురద, రాళ్లు కొన్ని వందల అడుగుల ఎత్తున ఎగిరిపడతాయనని వెల్లడిరచింది. కొన్ని సందర్భాల్లో ఈ పేలుళ్లు 100 మీటర్ల గోతులను కూడా సృష్టిస్తాయని తెలిపింది.







