ప్రారంభమైన హెచ్ 1బీ వీసా ప్రక్రియ
యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ ఈ ఏడాది జనవరిలో లాటరీ వ్యవస్థలో పెద్ద మార్పులను ప్రతిపాదించింది. మరోవైపు తాజా మీడియా సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మాట్లాడుతూ గ్రీన్‌కార్డ్, హెచ్ 1బీ వీసా దరఖాస్తుల బ్యాక్లాగ్, చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రకటన వెలువడింది. ఆ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, సహకారాన్ని పెంపొందించడానికి ది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మైయూఎస్సీఐఎస్ సంస్థాగత ఖాతాలను ప్రారంభించాలని సూచించింది. తాజా ప్రకటన ప్రకారం మార్చి 6న హెచ్ 1బీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 22తో ముగుస్తాయి. ఎంపికైన దరఖాస్తుదారులను మార్చి 31న ప్రకటిస్తారు. ఏప్రిల్ 1 ఎంపికైన దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.







