భారతీయులకు జాగ్రత ఎక్కువ – గంగాధర్ నాదెళ్ళ, డిట్రాయిట్
తానా మాజీ అధ్యక్షులుగా ఎన్ఆర్ఐ టీడీపీ లో యాక్టివ్ సభ్యులుగా, బిజినెస్‌మాన్‌గా అందరికి తెలిసిన, డిటాయ్రిట్ వాస్తవ్యలు గంగాధర్ నాదెళ్ళ తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ అమెరికా లో భారతీయులకు జాగ్రత్తలు ఎక్కువని, ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా అందరూ ధైర్యంగా క్షేమంగానే ఉన్నారని మున్ముందు కూడా ఉంటారని అన్నారు.
కరోనా సంక్షోభం గురించి మాట్లాడుతూ శ్రీ గంగాధర్ ప్రస్తుత పరిస్థితి భయంగానే ఉందని, రాబోయే 2-3 వారాలు, 1-2 నెలలు పరిస్థితులు ఇంకా కఠినతరం కావచ్చని అయినా కమ్యూనిటీ జాగ్రతగానే ఉంటోందని తెలిపారు. బాగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయాలు రాజకీయ పరంగా ఉంటున్నాయని, ఎకానమిపరంగా, లేదా ఆరోగ్య పరంగా లేవని, ఏమైనా నవంబర్ 2020 అభివృద్ధి ఎన్నికలు పూర్తి అవ్వాలని, ఈ లోపల బలవంతాన సాధారణ పరిస్థితులు వచ్చేయాలని ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంటూ, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోందని ఇది దురదృష్టకరం అని శ్రీ గంగాధర్ తెలిపారు.
కొన్నాళ్ళు అంటే వ్యాక్సిన్ వచ్చేదాకా ప్రజలు కూడా ఈ కరోనా రోజులను జాగ్రత్తగా గడపాలి అని చెపుతూ 1000 మందితో జరిగే కార్యక్రమం 100 మందితో, 100 మందితో జరిగే వేడుకలను 20 మందితో చేయటం కమ్యూనిటీ అలవాటు చేసుకోవాలని అని చెప్పారు. ప్రతి వ్యక్తి మాస్క్ ధరించటం, సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి అని చెపుతూ ఎవరికీ వారు స్వీయ రక్షణ చేసుకోవటం అన్నది ఉత్తమమైన మార్గం అని గంగాధర్ నాదెళ్ళ అన్నారు.






