Dallas: డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటు చేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి. అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.
ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి. జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండె దగ్గర ఉంచుకోవాలి. టోపీలు ధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద.
భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణ సంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదం ఉంది.
ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు.
మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు. నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం.
ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.
చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.
మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;
1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.
వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.
వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.
భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.
రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సురేష్ మండువ, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.
అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.







