అమెరికాలో తెలుగు డాక్టర్‌పై కాల్పులు
అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు (64) దుర్మరణం చెందారు. టస్కలూసా నగరంలోని ఆయన ఇంటి సమీపంలో ఉన్న కారు షెడ్‌వద్ద ఈ దారుణం జరిగింది. అమెరికాలో అనేక ఆసుపత్రులను నిర్వహించిన రమేశ్‌బాబు క్రిమ్సన్ నెట్వర్క్ పేరుతో పనిచేస్తున్న స్థానిక వైద్యాధికారుల బృందానికి వ్యవస్థాపకుడు. ఈ బృందానికి మెడికల్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య రంగంలో 38 సంవత్సరాల పాటు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా టస్కలూసాలోని ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. కొవిడ్ సమయంలో ఆయన అందించిన సేవలకు పలు అవార్డులు అందుకున్నారు. చేనేత కుటుంబానికి చెందిన రమేష్ బాబు తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత అమెరికా వెళ్లి జమైకాలో పీజీ పూర్తి చేసి డాక్టర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు. అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్న శ్రీలతను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు అమెరికాలో స్థిరపడ్డారు.







