ప్రస్తుతానికి గండం నుంచి బయటపడినట్టే… డాక్టర్ మధు కొర్రపాటి
న్యూయార్క్ రాష్ట్రంలో మినియోలా పట్టణంలో నివసించే ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా।। మధు కొర్రపాటి, నాట్స్ తెలుగు సంఘానికి పూర్వ చైర్మన్‌గా కూడా పనిచేసి తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా పేరు పొందారు. కరోనా మహమ్మారితో ఓ డాక్టర్‌గా ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న డా।। మధు కొర్రపాటిని తెలుగు టైమ్స్ కరోనా విషయమై అడిగినప్పుడు ఆయన చెప్పిన పలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రస్తుతానికి మనం గండం నుంచి బయటపడినట్టే అని చెపుతూ తాను మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 వరకు దాదాపు 6 వారాలు రోజుకి 70-80 కరోనా రోగులకు హాస్పిటల్లో చికిత్స చేసి, వారికి కావాల్సిన మందులు ఇస్తూ ట్రీట్మెంట్ చేసినట్లు చెప్పారు. తాను ఉంటున్న ఆసుపత్రిలోని 8 అంతస్థులు కూడా కరోనా రోగులతో నిండిపోయి ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిందని, ఐసీయులో కొందరు రోగులు, జనరల్ వార్డ్‌లో, రూములలో కొందరు రోగులు ఉన్నారని చెప్పారు.
అయితే వాక్సిన్ వచ్చేవరకు కరోనాని ఆపలేము అని అనుకోనక్కరలేదని చెబుతూ, గత 2 నెలలో కరోనా వ్యాధి నివారణకు చేసిన ట్రీట్మెంట్లతో చాలా అనుభవం వచ్చిందని, ఇప్పుడు రోగ నివారణ చర్యలు సరిగ్గా చేయగలుగుతున్నామని డాక్టర్ మధు తెలిపారు. ఎవరికి జ్వరం మాత్రలు సరిపోతాయి, ఎవరికి స్టెరాయిడ్స్ ఇవ్వాలి, ఎవరికి ప్లాస్మా ట్రీట్మెంట్ చేయ్యాలి, ఎవరికి వెంటిలేటర్ అవసరం వంటి అనేక విషయాల్లో డాక్టర్లుగా మాకు సృష్టత వచ్చింది అన్నారు.
అయితే కరోనా మన దేశం వదిలి వెళ్లిపోయిందని అనుకోకూడదని చెపుతూ. ఇప్పుడు ఇళ్ళలో ఉంటున్నారు కనుక తగ్గుముఖం పట్టింది. ఈ నెలాఖరికి న్యూయార్క్‌లో కూడా ఆంక్షలు ఎత్తివేసిన తరువాత ప్రజలు మళ్ళీ బయటకు వచ్చి జాగ్రత్తలు పాటించక పోతే ఈ సంక్షోభం సెకండ్ వేవ్‌లో కూడా మళ్ళీ రావచ్చు. అలాగే ఈ జూన్-జూలైలో కరోనాని తప్పించుకున్నా, నవంబర్, డిసెంబర్లో చలి మొదలు అయ్యాక మళ్ళి విజృంభించవచ్చు. అప్పుడు ఏం చేసినా ఏప్రిల్ – మే వరకు అందరూ బాధ పడాల్సిందే.
కరోనా రాకుండా చేయాల్సిన చర్యలు ముఖానికి మాస్క్ పెట్టుకోవడం, చేతులు కడుక్కోవటం, భౌతిక దూరం పాటించడం లాంటివి ఒక అలవాటుగా మార్చు కోవటం ఒకటే ఇప్పుడు అందరూ తప్పని సరిగా చేయాల్సి పని అని అన్నారు. తెలుగు సంఘాలు ఈ పరిస్థితులలో బాగా పనిచేస్తున్నాయని, ఒక పక్క వెబ్నాయర్ ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తూ రెండో పక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఇది మంచి పరిణామం అని తెలుగు సంఘాలను అభినందించారు డా. మధు కొర్రపాటి.






