కరోనా సంక్షోభం- పెద్దల మాట
వ్యాక్సిన్, యాంటీబయాటిక్స్ వచ్చేవరకు ఇంతే పరిస్థితి
– ప్రముఖ హృద్రోగ వైద్యనిపుణులు డా. హనిమిరెడ్డి లకిరెడ్డి
కరోనాని పాలకులు సరిగ్గా అర్థం చేసుకోక పోవటమే ప్రస్తుత సంక్షోభానికి కారణం అని కాలిఫోర్నియాలో నివసించే తెలుగు ప్రముఖులు, హృద్రోగ వైద్యనిపుణులు డా హనిమిరెడ్డి లకిరెడ్డి అన్నారు. ఇటు అమెరికాలోను, అటు ఇండియాలో కూడా ప్రభుత్వాలు పరిస్థితిని సరైన రీతిలో హ్యాండిల్ చేయడం లేదని అంటూ, ఇండియాలోని మోదీ ప్రభుత్వం ప్రసుత్తం వలస కూలీల విషయంలో చాలా అమానుషంగా వ్యవహరిస్తుందన్నారు. వేలకొద్ది వలస కూలీలు, వేల మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం చాలా బాధగా ఉందని అన్నారు. ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ప్రభావంపై సరైన అంచనా వేయడంలో విఫలమయ్యారని అంటూ, ప్రభుత్వాలు సరైన అవగాహన లేక అనవసరమైన చోట ఖర్చు పెడుతూ, అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. ఉదాహరణకి మా ఊరి (మైలవరం, కృష్ణా జిల్లా)లో 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని హడావిడిగా రెడీ చేశారని, ప్రస్తుతం అక్కడ రోగులు లేక ఖాళీగా ఉందన్నారు.
అమెరికాలో కరోనా మహమ్మారి అన్నీచోట్ల ప్రభావం చూపించడం లేదని వేడి ప్రదేశాలు అయిన కొలిఫోర్నియా, టెక్సాస్, ఆరిజోనా లాంటి రాష్ట్రాలలో కొవిడ్ కేసులు చాలా తగ్గిపోయాయని, చల్లటి ప్రదేశాలు అయిన నూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రంలో ఈ రోగం బాగా వృద్ధి చెందిందన్నారు. ఇప్పటిదాకా మలేరియా, టీబీ, మసూచి, పోలియో లాంటి జబ్బులకు మానవులు వాక్సిన్తో పాటు మందులు కూడా తయారు చేసి ఆ జబ్బులను పూర్తిగా నయం చేయగలిగారు. అలాగే కరోనాకి కూడా ఇప్పుడు ప్రపంచం అంతా, ముఖ్యంగా అమెరికా వ్యాక్సిన్ని కనిపెట్టానికి కంకణం కట్టుకొంది కనుక త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అమెరికాలో మళ్ళి చలికాలం వచ్చేలాగా కరోనాకి మందులు వస్తే మంచిదని చెపుతూ, ప్రజలు కూడా జాగ్రత్తగా మెలగాలి అని హెచ్చరించారు. కరోనా సంక్షోభం వలన ఎంతోమంది తెలుగువాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారని, అలాగే కాలేజీలో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు పోయాయని, వారిని ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. తెలుగు ప్రముఖులు, ధనవంతులు, తెలుగు సంఘాలు ఈ రెండు వర్గాలకు సహయపడాలని సూచించారు. తెలుగు సంఘాలు తమ ఆలోచనా ధోరణిని కొంచెంగా మార్చుకొని, కాలేజీ స్టూడెంట్లను, నిరుద్యోగులను ఆదుకోవాలని సూచించారు.
కరోనా సంక్షోభంపై అడిగిన వెంటనే అభిప్రాయాన్ని అందించిన డా।। హనిమిరెడ్డి లకిరెడ్డి గారికి కృతజ్ఞతలు.






