గాంధీ విగ్రహంపై దాడి అవమానకరం : ట్రంప్

అమెరికాలో నల్ల జాతీయుల ఆందోళన సందర్భంగా దుండగులు కొందరు మహాత్మా గాంధీ విగ్రహంపై దాడి చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అది అవమానకరమైన చర్యగా ట్రంప్ పేర్కొన్నారు. వైట్‍హౌస్‍లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆ సంఘటనను గుర్తు చేయగా, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‍లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న గాంధీ విగ్రహంపై ఈ నెల 2న అర్ధరాత్రి దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. రంగు పూసి అమమానించారు. దీనిపై భారత రాయబార కార్యాలయం అమెరికా ప్రభుత్వానికీ, స్థానిక పోలీసులకూ ఫిర్యాదు చేసింది. గాంధీ విగ్రహంపై దాడి విషయంలో భారత్‍కు అమెరికా ఇప్పటికే క్షమాపణ తెలిపింది. విగ్రహ పునరుద్ధరణకు హామీ ఇచ్చింది.
ఫిబ్రవరిలో భారత పర్యటన సందర్భంగా ట్రంప్ ఆయన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‍లోని సబర్మతీ ఆశ్రయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా గాంధీ ఉపయోగించిన రాట్నాన్ని పరిశీలించి, దాని పని తీరు గురించి ప్రధాని మోదీని అడిగి తెలుసుకున్నారు.