Connecticut: వైభవంగా ‘భారతీయత 2025’ వేడుకలు
భారతీయత, ఒక భావం మాత్రమే కాదు… అది జీవన విధానం. అది సంప్రదాయానికి ఆలంబన, ఆధునికతకు మార్గదర్శకత్వం. ఈ భావాన్ని ఆధారంగా చేసుకొని సత్సంకల్ప ఫౌండేషన్ నిర్వహించిన ‘‘భారతీయత 2025’’ కార్యక్రమం జూన్ 7న కనెక్టికట్ (Connecticut) లోని ఏవాన్ హై స్కూల్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం సమకాలీన ప్రపంచంలో భారతీయ ధర్మము, విలువలు, జ్ఞాన సంపదలకు వేదికగా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 800 మంది ప్రేక్షకులు, కళాకారులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. భారత దౌత్య కార్యాలయం, న్యూయార్క్ నుండి పీయూష్ సింగ్ ముఖ్య అతిథిగా, గత సంవత్సరం పురస్కార గ్రహీత డా. ఉమా వైజయంతిమాల, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి డా. జయప్రకాశ్ నారాయణ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్సంకల్ప సభ్యులచే అగస్త్య మహర్షి జీవితంపై రూపొందించబడిన కళాత్మక ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అగస్త్య మహర్షి, లోపాముద్ర, పరమశివుడు వంటి పాత్రలకు కనెక్టికట్ ప్రాంతానికి చెందిన కళాకారులు జీవం పోసారు. ఋషుల జీవన తత్వాన్ని నేటి యువతకి చేరవేసే ప్రయత్నంగా ఈ నాటిక నిలిచింది. వేదిక, పూర్వీక గురుకులాన్ని తలపించేలా అలంకరించబడిరది. ధ్యాన ముద్రలో అమర్చిన చిన్నారుల ప్రతిమలతో అలంకరణ వేదికను ఒక గురుకుల దృశ్యంలా మలిచింది. అగస్త్య మహర్షి ఆధారితంగా నిర్వహించిన శ్లోక పఠనం, చిత్రలేఖన పోటీలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల నైపుణ్యాన్ని ప్రోత్సహించారు. సత్సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాళ్ళపాక శ్రీధర్ ఈ సందర్భంగా భారతీయత, ధర్మం మరియు వాటిని జీవితంలో ఎలా అనుసరించాలో వివరించారు.
మహర్షుల జీవితాలపై ఫౌండేషన్ చేపడుతున్న పరిశోధనల గురించి, ముఖ్యంగా అగస్త్య మహర్షిని ఆధారంగా తీసుకున్న ఈ సంవత్సరానికిగల ప్రధానాంశాన్ని ఆయన విశదీకరించారు. భారతదేశం మరియు అమెరికా పట్ల మనకు ఉన్న ఋణాన్ని, భారతీయతను ఆచరణలో పెట్టడం ద్వారా తీర్చగలమని స్పష్టం చేశారు. పీయూష్ సింగ్, డా. జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ ‘‘మనమంతా భారతీయులమన్న గర్వంతో జీవించాలి. అమెరికాలో నివసిస్తూ రెండు సంస్కృతులనూ ఆనందంగా పండగలా జరుపుకోవాలి’’ అని అన్నారు. డా. ఉమా వైజయంతిమాల గారు యువతను ఉద్దేశించి ‘మన శాస్త్రాలను నేర్చుకోవాలని, మన పరంపరల్ని గౌరవిస్తూ, ఉన్నత విలువలను అలవరచుకోవాలి’’ అని సూచించారు.
పూజ్య గురువులు శివానంద మూర్తి స్ఫూర్తితో ప్రారంభమైన సత్సంకల్ప ఫౌండేషన్, తరతరాలకు భారతీయతను అందించాలనే దీర్ఘదృష్టితో ఈ విధమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది ఒక ఉత్సవం మాత్రమే కాదు ఒక పునఃస్మరణ, ఒక ఆత్మవిమర్శ, మరియు ఒక ధర్మపథానికి ఆహ్వానం.







