Maoists vs Ashanna: మాజీలు వర్సెస్ మావోయిస్టులు.. తాము కోవర్టులం కాదన్న ఆశన్న..!
మావోయిస్టుల (Maoists) లొంగుబాటు అంశం.. ఇప్పుడా ఉద్యమాన్ని షేక్ చేస్తోంది. ఎవరు ఉద్యమంలో ఉంటారు.. ఎవరు లొంగిపోతారు అన్న అంశంపై వారిలో వారికే అవగాహన లేని పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ కగార్ తర్వాత కేంద్రం.. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. అయితే లొంగిపోవడం, లేదంటే తూటాలకు బలికావడం తప్ప.. మరో పరిస్థితి లేదు. అందుకే .. ఇక ఈ పోరాటం విరమించి లొంగిపోవడం మంచిదన్న భావనకు పలువురు మావోయిస్టులు వచ్చారు. వారిలో కొందరు లొంగిపోయారు. అయితే లొంగిపోయిన వారు కోవర్టులంటే ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్న వారు ఆరోపణలు చేస్తున్నారు.
తమ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న (రూపేశ్) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కోవర్టులుగా పనిచేసి పార్టీకి ద్రోహం చేశామన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సాయుధ పోరాటాన్ని విరమించాలనే నిర్ణయం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు (బస్వరాజ్) బతికుండగానే ఆయన నాయకత్వంలో తీసుకున్నదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు లొంగిపోయిన ఇతర మావోయిస్టులతో కలిసి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
“మావోయిస్టు పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా ద్రోహులు అనడం పరిపాటి. అందుకే మొదట స్పందించవద్దని అనుకున్నాం. కానీ, పార్టీకి జరిగిన నష్టానికి మేమే కారణమని, కోవర్టులుగా పనిచేశామని ఆరోపించడంతో సమాధానం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం” అని ఆశన్న తెలిపారు. అడవి మార్గాన్ని వీడే క్రమంలో సాయుధ పోరాట విరమణ, శాంతి చర్చలు అనే రెండు అంశాలపై చర్చ జరిగిందని, చివరికి సాయుధ పోరాట విరమణకే మొగ్గు చూపినట్లు వివరించారు. ఈ చర్చలన్నీ ఏప్రిల్-మే నెలల్లో బస్వరాజ్ నాయకత్వంలోనే జరిగాయని, ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి తిరిగి వచ్చి చెప్పలేరనే ధైర్యంతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆశన్న విమర్శించారు.
సాయుధ పోరాట విరమణ విషయంలో బస్వరాజ్ రాసిన చివరి లేఖను పార్టీలోని కొందరు కీలక నేతలు దాచిపెట్టారని ఆశన్న సంచలన ఆరోపణలు చేశారు. “మే 18న బస్వరాజ్ తన చివరి లేఖ పంపిన తర్వాతే ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆ తర్వాత నేను కొందరు కేంద్ర కమిటీ సభ్యులను కలిసి ఆ లేఖను చూపించాను. మనం ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోలేదని, పార్టీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బస్వరాజ్ ఆ లేఖలో స్పష్టంగా రాశారు. అయితే మే 13న ఆయన కేంద్ర కమిటీ సభ్యులందరికీ రాసిన లేఖను మాత్రం ఒకరిద్దరు చదివి, మిగతావారికి ఇవ్వకుండా దాచిపెట్టారు. ఆ లేఖ బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే ఇలా చేస్తున్నారు” అని ఆశన్న ఆరోపించారు.
ఈ విషయంలో పౌరహక్కుల సంఘాల నేతలు, ప్రజాస్వామ్యవాదులు తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆశన్న మండిపడ్డారు. “హైదరాబాద్‌లో కూర్చుని ఆయుధాలే ముఖ్యమంటున్నారు. మా శవాలు వస్తే ఎర్రజెండాలు పట్టుకుని ఊరేగింపులు చేద్దామనుకుంటున్నారా? దారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏ లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేయాలి?” అని ఆయన ప్రశ్నించారు. పౌరహక్కుల సంఘాల నేతలు రెండు వైపులా వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలా నిర్ధారణకు వస్తారని నిలదీశారు. తాము అందుబాటులోనే ఉన్నామని, వాస్తవాలు తెలుసుకోవాలంటే తమను సంప్రదించవచ్చని సూచించారు.







