Bathukamma: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ బతుకమ్మ (Bathukamma) సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అక్కడ నివసిస్తున్న తెలంగాణ వారితో పాటు ఇతర ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. సప్తసముద్రాలు దాటి ఇతర దేశాలకు వెళ్లినా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తుండటం ఎంతో సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ పండుగలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, సంస్కృతి పరిరక్షణ కోసం ప్రత్యేక నిధులు కూడా విడుదల చేసిందని పేర్కొన్నారు.
అదే విధంగా చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ప్రాచీనమైనదని, బతుకమ్మ (Bathukamma) వంటి పండుగలు ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని తెలిపారు. ఆస్ట్రేలియాలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచమంతా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకల్లో అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ కుమార్ చొల్లూరి, ఉపాధ్యక్షుడు మాధవ రెడ్డి గుర్రం, కార్యదర్శి దయాకర్ బచ్చు, ప్రతినిధులు ఉమేశ్ వంగపల్లి, సంతోష్ రావు ఏకే, విజయ నల్ల, శ్రీకళా రూపిరెడ్డి, ప్రియాంక కర్క, విజయ్ కోరబోయిన, ప్రేమలత వాసాల, విరించి రెడ్డి ఎక్కంటి, హరిత తన్నీరు తదితరులు పాల్గొన్నారు.