Bathukamma: అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ (Bathukamma) పండుగ సంబురాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (UAE) అబుదాబిలో అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరిగాయి. ఎడారి ప్రాంతంలో పూల కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ నుంచి వందల కిలోల పూలను ప్రత్యేకంగా తెప్పించి, నగరంలో పూల వాతావరణాన్ని సృష్టించడం ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సామూహిక బతుకమ్మ తయారీతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఫస్ట్ సెక్రటరీ శ్రీ జార్జీ జార్జ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రంగురంగుల బతుకమ్మలు (Bathukamma), సాంప్రదాయ దుస్తుల్లో మహిళల నృత్యాలు, చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పులు, కోలాటాలతో ఈ ప్రాంగణం మరింత సందడిగా మారింది. భారత్ నుంచి తెప్పించిన అరిసెలు, గారెలు, బొబ్బట్లు వంటి పిండి వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విదేశాల్లో బతుకమ్మను (Bathukamma) ఇంత ఘనంగా జరుపుకోవడం గర్వకారణంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ, సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు.