Bathukamma: స్కాట్లాండ్‌లో మదర్ ఎర్త్ టెంపుల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

స్కాట్లాండ్‌లోని (Scotland) మదర్ ఎర్త్ హిందూ టెంపుల్‌లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ (Bathukamma) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు డా. పునీత్ బేడి, ఉపాధ్యక్షురాలు డా. మమత వుసికాలా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. గత మూడు సంవత్సరాలుగా వివిధ భారతీయ రాష్ట్రాల సంస్కృతులను పరిచయం చేస్తూ నవరాత్రి (Navratri) ఉత్సవాలను జరుపుతున్న ఈ దేవాలయం, ఈ సంవత్సరం బతుకమ్మ (Bathukamma) పండుగకు ప్రత్యేక స్థానం కల్పించింది.
డా. మమత వుసికాలా, వినీల బత్తుల, వారి స్నేహితులు, దేవాలయ కమిటీ సభ్యుల సమన్వయంతో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. సాంప్రదాయ వస్త్రధారణలో హాజరైన మహిళలు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను (Bathukamma) తయారు చేసి, భక్తి శ్రద్ధలతో ఆడిపాడారు. బతుకమ్మ పాటలు, నృత్యాలతో పాటు కోలాటం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉల్లాసంగా పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని సరస్సులో బతుకమ్మలను (Bathukamma) నిమజ్జనం చేశారు. పండుగ ముగింపులో ఏర్పాటు చేసిన విందును అందరూ ఆస్వాదించారు. స్కాట్లాండ్‌లో తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబిస్తూ జరిగిన ఈ వేడుకలు ప్రవాస భారతీయులకు మధురానుభూతిని మిగిల్చాయి.