BATA,AIA: అలరించిన బాటా, ఎఐఎ కరవొకె
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), అసోసియేషన్స్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల, మహానటి సావిత్రి గార్ల జయంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన కరవొకె కార్యక్రమంలో పలువురు గాయనీగాయకులు పాల్గొని మధురమైన పాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీనటి సావిత్రి కుమారుడు సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి మనసున్న తన మాతృమూర్తి సావిత్రి ఎందరో నిరుపేదలకు అండగా నిలిచి వారికి ఆర్థికంగా సహాయం చేసిన మానవతమూర్తి అన్నారు. ఆ మహానటి సావిత్రికి తాను కుమారుడుగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు ప్రసాద్ మంగిన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ బాటా సంస్థ ద్వారా ఘంటసాల, సావిత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జాతీయ అంతర్జాతీయ నాయకుడు స్వర కిన్నెర డాక్టర్ చింతలపూడి త్రినాథ రావు మాట్లాడుతూ… అమత గాయకుడు ఘంటసాల తన అభిమాన గాయకుడని, సావిత్రి తన అభిమాన నటి అని అన్నారు. రోజుకొక పాట శీర్షిక పేరుతో నిర్విం మంగా ప్రతిరోజు ఘంటసాల పాటల గానయజ్ఞం నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఇదే సభలో ఇటీవల మరణించిన సినీ నటుడు ధర్మేంద్ర కు సభలో నివాళులర్పించారు. ముందుగా జరిగిన సినీ సంగీత విభావరిలో సినీ నేపథ్య గాయనీ గాయకులు సుశీల, జిక్కి, లీల, ఘంటసాల గానం చేసిన పలు తెలుగు చిత్రాలలోని పలు యుగళ, ఏకగళ గీతాలను కాలిఫోర్నియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయనీ గాయకులు మధురంగా గానం చేశారు.
బాటా నాయకులు వీరు ఉప్పల, కొండల్ కొమరగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-Govindarajan






