Dallas: డల్లాస్ లో కేవీ సత్యనారాయణను సత్కరించిన ఆటా

అమెరికా తెలుగు సంఘం(ATA) 2025 జూలై 21వ తేదీ సాయంత్రం డల్లాస్ (Dallas) నగరంలో ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ నాట్యకళాకారుడు ‘కళారత్న కేవీ సత్యనారయణ గారిని కళా రంగానికి నాట్య రంగానికి చేస్తున్నసేవలకు అభినందిస్తూ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని సంయుక్త కార్యదర్శి శారద సింగిరెడ్డి నిర్వహణలో ప్రారంభించారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి స్వాగతం పలుకుతూ కేవీ సత్యనారాయణ గారికి ఆటా తో ఉన్న అనుబంధాన్ని ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. తర్వాత తానా పూర్వ అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ కేవీ సత్యనారాయణ గారు చిన్నతనం నుండి ఇప్పటివరకు సాధించిన విజయాలు సన్మానాలు సత్కారాలు వారి కళా ప్రదర్శన గూర్చి వివరము గా తెలియజేస్తూ ప్రసంగించి, కేవీ సత్యనారాయణ గారిని అభినందించారు.
ఆటా సన్మాన పత్రమును ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శారద సింగిరెడ్డి మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రఘువీర్ మరిపెద్ది, ఆటా కార్యవర్గ బృంద సభ్యులు కేవీ సత్యనారాయణ గారికి ప్రదానం చేశారు. తదనంతరం కేవీ సత్యనారయణ గారు తనకు జరిగిన సన్మానానికి ఆటా బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలను, గురువులతో ఉన్న సంబంధాన్ని, పెద్దల ఆశీస్సులను, సినీ జీవితం గురించి మాట్లాడారు. కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా యువత ప్రదర్శించిన సంగీత నృత్యాలు నిలిచాయి. నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సభ వార్షికోత్సవములో కేవీ సత్యనారయణ ప్రదర్శించిన కాలార్చనకు ప్రేక్షకులనుంచి విశేష ప్రశంసలు లభించాయి.
ఆటా సభ్యులు గోలి బుచ్చిరెడ్డి, రామ్ అన్నాడి, శ్రీకాంత్ జొన్నల,శ్రీనివాస్ రెడ్డి కేలం, మాధవి మెంట, సుమన బీరం, నీరజ పడిగెల, సుమ ముప్పాల, హరిత కేలం, మరియు ఇతర సంఘ ప్రముఖులు వురిమిండి నరసింహా రెడ్డి, చిన సత్యం వీరనపు తదితరులు పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ మాసములో జరగబోయే ఆటా సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఆటా వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు రావాలని అహ్వానించారు. నాట్యకళకు సేవచేసె వ్యక్తులకు ఇటువంటి గౌరవాలు కొనసాగలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ముగించారు.