తానాలో ఎన్నికలు జరగబోతున్నాయా?? బోర్డ్ నిర్ణయం ఇదేనా?
తానాలో ఇటీవల జరిగిన ఫైనాన్షియల్ కుంభకోణం వలన తానా చెయ్యాలిసిన కాన్ఫరెన్స్ పనులు, రెండుసంవత్సరాలకొకసారి జరపాల్సిన ఎన్నికల ప్రక్రియలాంటి కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఆగిపోవడంతో తానా నాయకత్వం మరియు సభ్యులు ఆందోళనతో వున్న మాట వాస్తవం.
ఈ నేపథ్యంలో తానా బోర్డు మీటింగ్ జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అందిన సమాచారం ప్రకారం తానా బోర్డు నిర్ణయాలు…
1. రెండు సంవత్సరాలకొకసారి జరపాల్సిన ఎన్నికల ప్రణాళిక గురించి నోటిఫికేషన్ 31 జనవరి లోపల వెలువడాల్సి ఉంది. తానా బైలాస్ ఆర్టికల్ 14 – సెక్షన్ 10B ప్రకారం జరగాల్సిన ఈ ప్రక్రియ గడువు తేదీని 31 మార్చి 2025 పొడిగిస్తూ ఒక తీర్మానం చేశారు. అంటే 2025 – 27 కాలానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, 2027 – 29 కాలానికి తానా ప్రెసిడెంట్ ని ఎన్నుకునేందుకు వీలుగా ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి, జులై 2025 నుంచి పనిచేయాల్సిన కొత్త బోర్డుని సిద్ధం చేస్తారు.
2. నవంబర్ – డిసెంబర్ 2024లో బయటపడి తానాను కుదిపేసిన తానా నిధుల మళ్లింపు గురించి కూడా తానా బోర్డు కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది. నిందితుడు శ్రీకాంత్ పొలవరపు నుంచి వెనక్కి ఇస్తానన్న డబ్బులు రాని కారణంగా పూర్తిస్థాయి విచారణ, నిందితుడికి శిక్ష, నిందితుడు దగ్గర నుంచి డబ్బు వెనక్కి వచ్చే ప్రక్రియ మీద FBI కి ఈ కేసు పరిశోధనని వేగవంతం చేయాలని మరొకసారి కోరనున్నారు.
3. తానా బోర్డు సభ్యులు శ్రీ శ్రీనివాస్ లావు చైర్మన్గా, శ్రీ భరత్ మద్దినేని, శ్రీ రాజా కసుకుర్తి సభ్యులు గా ఒక కమిటీ ని ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ కమిటీ తానా ఫౌండేషన్ లో గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన అకౌంట్స్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించే భాధ్యత తీసుకొంది.
4. అదే విధంగా శ్రీ చలపతి కొండ్రుకుంట చైర్మన్ గా ఒక ఆడిట్ కమిటీ ని ఏర్పాటు చేసి, వారికి తానా అకౌంట్స్ కూడా ఆడిట్ చేయమని ఆదేశించినట్లు తెలిసింది.







