అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి హత్య
అమెరికాలో ఓ దుండగుడు దాడి చేయడంతో తాజాగా మరో భారత సంతతి వ్యక్తి మృతి చెందారు. ఓక్లహామాలో ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని హేమంత్ మిస్త్రీ (59)గా గుర్తించారు. గుజరాత్‌కు చెందిన మిస్త్రీ కొన్నేళ్ల క్రితం అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఓక్లహామాలో ఓ మోటెల్ మేనేజరుగా పనిచేస్తున్నారు. గత శనివారం ఈ మోటెల్‌కు రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తి వచ్చాడు. ఏదో కారణంగా గొడవ మొదలై రిచర్డ్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని మిస్త్రీ గట్టిగా చెప్పారు. దీంతో ఆవేశానికి గురైన రిచర్డ్ ఆయన ముఖంపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు కుప్పకూలిన మిస్త్రీని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరుసటిరోజూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.







