Dallas: అమెరికాలో అంబికా దర్బార్ బత్తి వ్యాపార విస్తరణ.. డల్లాస్‌లో చైర్మన్ అంబికా కృష్ణ వెల్లడి

డల్లాస్ (Dallas) లో పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ (Ambika Krishna) ఆత్మీయ సమావేశం ఇటీవల వైభవంగా జరిగింది. అంబికాదర్బార్ బత్తికి భారతదేశంలో బహుళ ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ‘భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది’, ‘అమ్మను మర్చిపోలేము-అంబికను మరిచిపోలేము’ వంటి వినూత్న ప్రచార శీర్షికలతో తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశవ్యాప్తంగా పేరుగడించిన అంబికా దర్బార్ బత్తి వ్యాపారాన్ని ఇప్పుడు అమెరికాలో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్లు ఆ సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు వెల్లడించారు. 1946లో తన తండ్రి ఆలపాటి రామచంద్రరావు ప్రారంభించిన సంస్థలో 1968 లో జేరిన తాను అంచలంచెలుగా సంస్థను బలోపేతం చేసిన తీరు, వ్యాపార-సినిమా-రాజకీయ రంగాల్లో తన అనుభవాలను, జీవితపాఠాలను సభికులతో జరిపిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో చాలా నిజాయితీగా, చలోక్తులతో అంబికా కృష్ణ సరదాగా పంచుకున్నారు. తన వెంటపడిన రాజకీయ అవకాశాలు శాసనసభ్యునిగా విజయాన్ని అందించగా, తాను వెంటపడిన రాజకీయ అవకాశాలు ఓటమి పాఠాలు నేర్పాయని, ‘నమ్మకమే అమ్మకమని’ తన తండ్రి చెప్పిన వ్యాపారసూత్రాన్ని పాటించి తాను ఈ స్థితికి చేరుకున్నానని అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు.
నిర్మాతగా తాను తీసిన 10 సినిమాల్లో 7 సరిగ్గా ఆడకపోయినా అనుభవాలు, మిత్రులు, పరిచయాలు పెరిగాయని అంబికా కృష్ణ ఆశావహంగా ప్రసంగించారు. నందమూరి బాలకృష్ణ తాను మంచి మిత్రులమని, ప్రతిరోజు మాట్లాడుకోకుండా ఉండలేమని ఆయన వెల్లడిరచారు. ఏలూరులో సంగీత-సాహిత్య-కళా రంగాలకు తాము సేవ చేస్తున్నామని, 2,500 మంది ఉద్యోగులతో తమ సంస్థ అంబికామాత ఆశీర్వాద బలంతో దూసుకెళ్తోందని అన్నారు. 120కు పైగా వ్యాపార ఉత్పత్తులే గాక హోటల్ రంగంలో కూడా తాము ప్రవేశించామని కృష్ణ తెలిపారు. ఇప్పటికీ తమది ఉమ్మడి కుటుంబమన్న అంబికా కృష్ణ ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం వెనుక అహంకారానికి, అవసరాలను అర్థంచేసుకునే మనోస్థితికి మధ్య సమన్వయమే కారణమని పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులు ఎల్లప్పుడూ నవ్వుతుండటం వెనుక అంబికా అమ్మవారి కృప ఉందని వెల్లడిరచారు. తాను 30 దేశాల్లో తిరిగినా అమెరికా అంటే అదొక ఆత్మీయ అనుభూతి అని ఇక్కడి మిత్రులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటుందన్నారు. ఏలూరు ప్రాంత చరిత్రను కూలంకషంగా వివరిస్తూ డా. తోటకూర ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంతం నుండి సామాజిక-సాంఘిక-రాజకీయ-సినిమా-వ్యాపార-కళా రంగాల్లో విజయతీరాలు అందుకున్నవారిని ప్రసాద్ స్మరించుకున్నారు.
కళారత్న కె.వి. సత్యనారాయణ అంబికా కుటుంబంతో తనకున్నఅనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం అంబికా కృష్ణకు డా. తోటకూర ప్రసాద్ తన మిత్రబృందంతో కలసి ‘‘ఔట్ స్టాండిరగ్ లీడర్ షిప్’’ అవార్డు ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు. ఫ్లేవర్స్ రెస్టారెంట్ వారు అందించిన విందుభోజనం అందరి మన్ననలను పొందింది.