చక్రి కుటుంబానికి చేయూత
లాక్డౌన్ కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. చేసేందుకు పనులు లేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. సినిమాలకు పనిచేసేవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో అతికష్టం మీద జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారి కోసం సినీ పెద్దలు, కొన్ని ఫౌండేషన్స్ ఇతోధికంగా సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత డా. అనూహ్యరెడ్డి ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత నెలరోజులుగా పేదలకు నిత్యావసర వస్తువులతోపాటు ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాదు మాస్కులు, శానిటైజర్లు అందజేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి సోదరుడు మహిత్, అతని తల్లితో కలిసి మణికొండలో నివాసముంటున్నాడు. వారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న అనూహ్యరెడ్డి వారికి రెండు నెలలకు సరిపోయే నిత్యావసర వస్తువులు, మందులు అందించారు.
ఈ సందర్భంగా అనూహ్యరెడ్డి మాట్లాడుతూ ‘‘తమకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన మహిత్ తనకు పని కల్పించమని అడిగారు. కరోనాపై ఓ ట్యూన్ చెయ్యాల్సిందిగా మహిత్ను కోరాను’’ అన్నారు. మహిత్ మాట్లాడుతూ ‘‘ఒక సోదరిగా అనూహ్యరెడ్డిగారు ఇచ్చిన భరోసా నన్ను కదిలించింది. నేను ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు చేశాను. నా టాలెంట్ చూసి నన్ను ఎంకరేజ్ చెయ్యమని కోరాను’’ అన్నారు.






