Dhanush: అనుమానంతో నా భార్య వేధిస్తోంది
కన్నడ నటుడు ధనుష్(Dhanush) తన భార్య తనను వేధిస్తుందని గిరినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పలు కన్నడ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ తో పాటూ శివాజీ సూరత్కల్(Sivaji sooratkal) అనే మూవీలో నటించిన ధనుష్ తొమ్మిది నెలల కిందట ఆశ్రిత(Asritha) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.
ఇప్పుడు ఆ గొడవలు మరింత ఎక్కువవడంతో ధనుష్ తన భార్యపై కేసు పెడుతూ పోలీసులను సంప్రదించాడు. దీంతో ఈ విషయం కన్నడ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. తాను అబద్ధం చెప్తున్నానని తనపై అనుమానంతో తన భార్య తనను శారీరకంగా హింసిస్తోందని, తనపై దాడి కూడా చేసిందని ధనుష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వర్క్ పై విదేశాలకు వెళ్తే వేరే మహిళతో వెళ్లానని అనుమానపడుతుందని ఆయన చెప్పాడు.
విదేశాలకు వెళ్లొచ్చాక తమ ఇంట్లో గొడవ జరిగిందని, గూండాలతో దాడి చేయించడమే కాకుండా చంపేస్తానని బెదిరించిందని, పైగా బాత్ రూమ్ లో అద్దం పగలకొట్టి దాంతో చేతిని కట్ చేసుకుని సూసైడ్ చేసుకుంటానని బెదిరించిందని ధనుష్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వేధింపులు, బెదిరింపులను ఉద్దేశించి తనకు రక్షణ కావాలని కోరుతూ తను పోలీసులను ఆశ్రయించినట్టు ధనుష్ తెలిపాడు. మరి ఈ విషయంలో ఎవరిది తప్పో తెలియాల్సి ఉంది.






