Shashtipoorthi: ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా ‘వేయి వేణువుల నాదం మోగే’ పాటను ప్లే చేస్తారు – దర్శకుడు పవన్ ప్రభ

ఇప్పటి వరకూ మూడు రొమాంటిక్ పాటలు విడుదల చేసిన ‘షష్టిపూర్తి’ (Shashtipoorthi) సినిమా బృందం, ఇప్పుడు టైటిల్ జస్టిఫికేషన్ చేస్తూ ‘షష్టిపూర్తి’ నేపథ్యoలో పాటను విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేసి, యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు.
డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లు గా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ రోజు విడుదల చేసిన ‘షష్టిపూర్తి’ నేపథ్యoలో వచ్చే గీతాన్ని చైతన్య ప్రసాద్ రచించగా, కార్తీక్, విభావరి ఆప్టే జోషి పాడారు. స్వర్ణ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు.
ఈ పాట గురించి దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ‘’వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన! ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన! సరాదలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవై లో ఇరవైలా విరిసిన వరమాల…’’ అంటూ సాగే ఈ గీతాన్ని చైతన్య ప్రసాద్ అద్బుతంగా రాశారు. ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్న ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజా గారి స్వరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది? ఈ పాట రికార్డింగ్ ని ప్రత్యక్షంగా వీక్షించి పులకించి పోయాను. సీనియర్ కళా దర్శకులు తోట తరణి గారు ఓ మండువ లోగిలిని ఈ పాట కోసం అత్యద్భుతంగా తీర్చి దిద్దారు. నిజంగా ఓ పెళ్లి వేడుకలో ఉన్నపుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, ఈ పాట చూస్తున్నపుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది.
రాజేంద్రప్రసాద్ గారు, అర్చన గారు, మా హీరో హీరోయిన్లు రూపేష్, ఆకాంక్ష సింగ్ లు ఈ పాటలో నిజంగా జీవించారు. చాలా కాలం గుర్తుండి పోయే పాట ఇది” అని తెలిపారు.