The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చేలా స్ఫూర్తినిచ్చింది – హేషమ్ అబ్దుల్ వహాబ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్” (The Girl Friend). ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి పనిచేసిన ఎక్సిపీరియన్స్ తెలియజేశారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్.
– తెలుగులో నేను ఒప్పుకున్న మొదటి సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమా తర్వాత ఖుషి, హాయ్ నాన్న సినిమాలు చేశాను. ఇవన్నీ ప్రేమ కథా చిత్రాలే. వీటిలో “ది గర్ల్ ఫ్రెండ్” కథలో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. వరుసగా ప్రేమ కథా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ వచ్చాను. ఇప్పుడు వేరే జానర్ మూవీస్ కు ఆఫర్స్ వస్తున్నాయి. కొన్ని ప్రేమ కథా చిత్రాలకు సంగీతాన్ని అందించాను అనే సంతృప్తి ఉంది.
– ఈ సినిమా రిలీజ్ అవడం లేట్ అయ్యింది. నేను ఈ సినిమాకు బీజీఎం స్టార్ట్ చేశా. అయితే కొన్ని కారణాలతో మూవీ లేట్ అవుతూ వచ్చింది. ఆ టైమ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రశాంత్ విహారిని తీసుకున్నారు. సాటి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రశాంత్ ఈ సినిమాకు పనిచేయడం హ్యాపీగా ఫీలయ్యా. అతను చాలా మంచి బీజీఎం ఇచ్చాడు. నేను అనుకున్న ఫీల్ అతని బీజీఎంలో కూడా కనిపించింది.
– “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి. వాటిలో నాలుగో పాట నీదే నీదే కథా రీసెంట్ గా రిలీజ్ చేశాం. ఈ పాట కంపోజింగ్ కోసం ఎక్కువ కష్టపడ్డాను. ఈ పాట చేసేముందు రాహుల్ నాకు చెప్పిందేంటంటే ఇది ప్రతి అమ్మాయి ఆంథెమ్ గా ఉండాలి, భూమా ఆంథెమ్ గా ఉండాలి అన్నారు. కష్టపడి ఈ పాట చేశా. మొత్తం ఆల్బమ్ కు రాహుల్ ఇండియన్, వెస్ట్రన్ కలిసిన మ్యూజిక్ కావాలని అడిగాడు. అందుకే మన రాగాలు, వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ ఉపయోగించాం.
– సినిమాలో విక్రమ్, భూమా పాత్రల మధ్య ఉండే సంఘర్షణే నేను ఈ సినిమాకు మంచి పాటలు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నేనూ ఈ సినిమా చూసి ఆలోచనలో పడ్డాను. మీరంతా మూవీ చూసి అప్రిషియేట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రాహుల్ కే దక్కుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ కథలో సరైన సందర్భంలో వచ్చేలా రాహుల్ డిజైన్ చేసుకున్నాడు.
– ఒక మంచి పాట చేసేందుకు ప్రతి సమయం సరైనదే. నాకు కంపోజింగ్ కు ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకోను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన దిల్ సే సినిమా పాటలను నేను చదువుకునేప్పుడు పాడేవాడిని. ఐఫా వేడుకల్లో ఆయన సమక్షంలో నేను కంపోజ్ చేసిన హాయ్ నాన్న పాటలు పాడటం మర్చిపోలేని సందర్భం. తెలుగులో కీరవాణి ఇష్టం. అలాగే థమన్, దేవిశ్రీ ప్రసాద్, భీమ్స్…వీళ్ల మ్యూజిక్ అన్నా ఇష్టపడతాను.
– నేను సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారాను. అందుకే నా సినిమాల్లో ఒక పాటైనా పాడమని మేకర్స్ అడుగుతుంటారు. మాస్ జాతర, కన్నప్ప లాంటి ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లోనూ పాటలు పాడాను. సింగర్ గా మిగతా చిత్రాల్లో పాడటం కూడా నాకు అనుభవాన్నిస్తోంది. దీంతో తెలుగు త్వరగా నేర్చుకుంటున్నా. వచ్చిన అన్ని అవకాశాలు చేయడం లేదు. ఒకేలా ఉన్న మూవీస్ వస్తే వదులుకుంటున్నా. అయితే సితార, గీతా ఆర్ట్స్, మైత్రీ లాంటి సంస్థల నుంచి ఏ అవకాశం వచ్చినా వదులుకోను. నాకు టాలీవుడ్ లో గుర్తింపు ఇచ్చిన సంస్థలు ఇవి.
– నేను లవ్ సాంగ్స్ ఎక్కువగా చేశాను. త్వరలో మాస్, బీట్ సాంగ్స్ కూడా చేయబోతున్నా. అలాంటి మూవీస్ అవకాశాలు వస్తున్నాయి. ప్రేమ కథలకు బీజీఎం చాలా కీలకం. నేను మ్యూజిక్ చేసిన మనమే, 8 వసంతాలు సినిమాల్లోని బీజీఎం కూడా మంచి పేరొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేయడం సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఒకదాని తర్వాత మరొకటిగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. మలయాళంలో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా దర్శకుడు ఆదిత్య హాసన్ రూపొందిస్తున్న సినిమాతో పాటు తమిళం, కన్నడలో సినిమాలు చేస్తున్నా. నా ఫస్ట్ బాలీవుడ్ మూవీ కూడా త్వరలో ప్రకటిస్తా.







