12A Railway Colony: ’12A రైల్వే కాలనీ’ ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో డిఫరెంట్ జోనర్ : భీమ్స్ సిసిరోలియో
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ’12A రైల్వే కాలనీ’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో(Bheems Cicirolia Interview) విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
’12A రైల్వే కాలనీ’ మీ ఫిల్మోగ్రఫీ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఫస్ట్ ఫస్ట్ టైం ఇలాంటి థ్రిల్లర్ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు కదా..ఎలాంటి కొత్తదనం ఉండబోతుంది?
-మ్యూజిక్ చేసిన నాకే కొత్తగా ఉంది. నేనే మ్యూజిక్ చేశానా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ జోనర్ సినిమా. కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో కొత్తగా ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది. నన్ను ఈ జోనర్ లో ఉండే మూవీస్ కి ఈ సినిమా తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను.
-నిన్ననే డిటిఎస్ లో సినిమా చూసుకున్నాను. బలే ఎక్సైటింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది.
ఈ ప్రాజెక్టు మీ దగ్గరికి ఎలా వచ్చింది?
-నిర్మాత శ్రీనివాస గారు ముందుగా అప్రోచ్ అయ్యారు. సినిమా మన కాంబినేషన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. పొలిమేర నాకు ఇష్టమైన సినిమాలు. ఆ సినిమాలో దర్శకుడు ఈ సినిమాకి రచయితగా షోరన్నర్ గా పనిచేయడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి జానర్ లో నేను సినిమా చేయగలను నమ్మకాన్ని ఈ ప్రాజెక్టు కల్పించింది. సినిమా చూసిన తర్వాత కూడా ఆడియన్స్ అదే ఫీల్ అవుతారని నమ్ముతున్నాను.
నరేష్ గారికి మీరు గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు కదా ఈ సినిమాలో అలాంటి పాటలకు స్కోప్ ఉందా?
-ఇందులో రెండు మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఆ రెండు పాటలు కూడా కథ నుంచే పుడతాయి. నేను చేసిన బలగం, మాస్ జాతర, ధమాకా, మ్యాడ్, టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం.. ఇవన్నీ ఒకటి గ్రామీణ నేపథ్యం, మరొకటి, మాస్ , యూత్ ఫుల్ మరొకటి ఫ్యామిలీ ఇలా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసే అవకాశం నాకు దొరికింది. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాలు ఒకేసారి రావడం నా అదృష్టం.
-ఇందులో రైల్వే కాలనీ ఇంకా స్పెషల్. సినిమా విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. అందరూ మ్యూజిక్ బాగుంటుందని చెప్తున్నారు. నిర్మాత శ్రీనివాస గారు నమ్మడం వల్లే ఇది సాధ్యమైంది. హీరో గారు దర్శక నిర్మాత రచయితలు నమ్మడం వల్లే నేను చేయగలిగాను. సినిమా చూసిన తర్వాత హీరో గారు నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
మ్యూజిక్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి కొత్తదనం ఫీలయ్యారు?
-నేను చేసే మాస్ ఓరియెంటెడ్ సౌండింగ్ ఇందులో ఉండదు. కంప్లీట్ గా వేరే సౌండ్ ఉంటుంది. కథకు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలో అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడడం జరిగింది. ఆడియన్స్ స్కేరీగా ఫీల్ అయ్యే సౌండ్ కూడా ఇందులో ఉంది.
తెలుగు సినిమా పాటల నేటివిటీ మిస్ అవుతుందనే ఫీలింగ్ మీకుందా?
-దర్శకుడు ఒక కథను రాసుకుని వస్తే ఆ కథకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. నా వరకు నేను చేసే పాటలో జనంతో అనుబంధం ఉండే పాటలే ఉంటాయి. ఈ సినిమా పాటలు విన్నప్పుడు కూడా ఒక అందమైన పాట విన్న అనుభూతి కలుగుతుంది.
మ్యూజిక్ డైరెక్టర్ కి కావాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏమిటి?
-ఓపిక ,సహనం, జ్ఞానం ,మనసు, ప్రేమ ,జాలి ,దయ ,తెగింపు ,పోరాటం .
మీరు చేసే సినిమాల ఫలితం మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చెబుతుంది?
-చప్పట్లు కొట్టినప్పుడు ఎంత సంతోషపడతామో చెప్పులతో కొట్టినప్పుడు కూడా అంతే సంతోషపడాలి. పబ్లిక్ ప్లాట్ ఫారం లో ఉన్నప్పుడు దేనికి పొంగి పోకూడదు కుంగిపోకూడదు. ఫలితాన్ని గురించి ఆలోచించుకుంటూ అందులోనే కూర్చుంటే మనకు తెలియని ఏదో ఒక అభద్రత భావం వస్తుంది.
-అందరం తప్పులు చేస్తాం అయితే ఆ తప్పుని మళ్ళీ పునరావృతం కాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను.
ఇతర భాషల నుంచి గాయకులని తీసుకురావడంతో తెలుగు భాషను ఖూనీ చేస్తున్నారనే విమర్శ ఉంటుంది.. దాన్ని మీరు ఎలా చూస్తారు?
-ఇప్పుడు భాషకు సంబంధించిన సరిహద్దులు చెరిగిపోయాయి. మన వాళ్ళు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అయితే పాడించుకున్నప్పుడు మన భాష యొక్క ఔన్నత్యం పోకుండా మన శ్రోతలు అసహ్యించుకోకుండా ఉంటే చాలు. ఒక పాట సరిగ్గా రాలేదంటే దానికి జవాబు చెప్పాల్సింది కూడా సంగీత దర్శకుడే. ఇప్పటివరకు నేను చేసిన పాటలు అలా నలిగిపోలేదని భావిస్తున్నాను. ఒకవేళ ఉంటే చెప్పండి. వాటిని నేను సరి చేసుకుంటాను.
ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కాంపిటీషన్ ఎలా ఉంటుంది?
-నాకు కాంపిటీషన్ తెలీదు. నేను ఆ జోనర్ లో లేను. నన్ను నమ్మి సినిమా ఇస్తే నమ్మకంగా పనిచేయాలి. డబ్బు ఇస్తే దానికి జవాబు దారిగా ఉండాలి. నాకు ఒక సినిమా ఇస్తే దాన్ని చక్కగా తీర్చిదిద్ది పంపించాలి. నాపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను.
టాప్ లీగ్ లో ఉన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కదా?
-స్మాల్, టాప్ ని లీగులు నేను నమ్మను. ఇలాంటి లీగ్ లు ఉంటే ఇప్పటివరకు నేను ఉండే వాడిని కాదేమో. నేను పబ్లిక్ నుంచి వచ్చాను. ప్రజలతోనే నాకు అనుబంధం వుంది. నాకు పని ఇస్తే పని చేస్తాను. అంతే
విమర్శలని ఎలా చూస్తారు?
-విమర్శ మంచిదే కానీ ఎందులోనైనా అతి మంచిది కాదు. ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూసాను. రవితేజ గారు స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకలాగా, నరేష్ గారి స్టేజ్ లో ఉన్నప్పుడు మరోక లాగా మాట్లాడానని కామెంట్లు పెట్టారు. సంగీత దర్శకుడిగా నాకు మొదట అవకాశం ఇచ్చింది నరేష్ గారు. ఆగిపోయిన నా కెరీర్ కి మరొక పునర్జన్మ ఇచ్చింది రవితేజ గారు. నేను ఇదే చెప్పాను. అయితే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక విమర్శలు చేశారు. అయితే ఇలా విమర్శించిన వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే. అందరూ మనోళ్లే. నేను అందరినీ గౌరవిస్తాను.
ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి?
-రవితేజ గారి భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకర వరప్రసాద్ గారు, డెకాయిట్, టైసన్ నాయుడు, సంపత్ నంది గారి భోగి, విశ్వక్సేన్ గారి ఫంకీ చిత్రాలు చేస్తున్నాను.






