US Trade Deal: దిగుమతి సుంకాలు భారీగా తగ్గే ఛాన్స్? తుది దశకు చర్చలు?

భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాల (US Tariffs) నుండి భారీ ఉపశమనం లభించే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మూడు నెలల క్రితం విధించిన 26 శాతం భారీ దిగుమతి సుంకాల విషయంలో మార్పు రాబోతోంది. ప్రస్తుతం భారత్, యూఎస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై (US Trade Deal) చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ఖరారైతే ప్రస్తుతం ఉన్న సుంకాలు 20 శాతాని కన్నా తగ్గుతాయని భారత వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అమెరికా కూడా ఈ చర్చల్లో సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం. ఈ సుంకాల తగ్గింపు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, లోహాల వంటి కీలక రంగాలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఈ తాత్కాలిక ఒప్పందం (US Trade Deal) భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో భారత్‌కు ఇచ్చిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) మినహాయింపులను అమెరికా రద్దు చేసిన నేపథ్యంలో.. ఈ సుంకాల (US Tariffs) ప్రభావం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త ఒప్పందం చేసుకుంటే భారత ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో మంచి లాభాలు దక్కుతాయి. అలాగే భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై విధించిన సుంకాలను తగ్గించడానికి సిద్ధంగా ఉందని సమాచారం.