అమెరికాలో కొత్తగా 2,23,000 ఉద్యోగాలు
డిసెంబరులో అమెరికా సంస్థలు కొత్తగా 2,23,000 ఉద్యోగాలు సృష్టించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వేగంగా వడ్డీ రేట్లు పెంచుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందడనడానికి ఇది నిదర్శమని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబరులో ఉద్యోగాల వృద్ధి నమోదైనప్పటికీ, రెండేళ్లలోనే అత్యల్ప నెలవారీ పెరుగుదల కనిపించింది. ఇక నిరుద్యోగ రేటు 53 ఏళ్ల కనిష్టమైన 3.5 శాతానికి చేరినట్లు అమెరికా కార్మిక శాఖ తెలిపింది. ఉద్యోగాల విపణి నెమ్మదించొచ్చన్న సంకేతాలు ఇందులో వెలువడ్డాయి. గతేడాది జులైలో 5,37,000 కొత్త ఉద్యోగాలు రాగా, గత నెలలో ఇవి సగానికి చేరాయి. సగటు గంటల వేతన వృద్ధి 4.6 శాతానికి పరిమితమైంది. నవంబరులో 4.8 శాతంగా ఉండగా, మార్చిలో గరిష్టంగా 5.6 శాతం నమోదైంది. ద్రవ్యోల్బణం నియంత్రణకు వడ్డీ రేట్లు పెంచుతున్న ఫెడ్ వర్గాలకు తాజా గణాంకాలు ఉపశమనం అందించనున్నాయి.






