ప్రైవేటు రంగం నుంచి భారత్ కు పెట్టుబడులు : అమెరికా
మౌలిక సదుపాయాల రంగంలో ఉన్న లోటును పూడ్చుకునేలా ప్రైవేటు రంగం నుంచి భారత్‌కు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో చురుకైన పాత్ర పోషించనున్నట్లు అమెరికా తెలిపింది. నూతన సాంకేతికతల వ్యయాన్ని తగ్గించి, ప్రపంచ ఆర్థిక రంగానికి చేయూతనివ్వడంలో ఇరుదేశాల ఆవిష్కరణలు దోహదపడాలని అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి జనెట్ యెలెన్ ఆకాంక్షించారు. అమెరికాకు విశ్వసనీయ వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటనీ, ప్రపంచ మార్కెట్‌కు కొత్త సమూహాలను అనుసంధానం చేయడంపై రెండు దేశాలూ కృషి చేస్తున్నాయని తెలిపారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి నిర్వహించిన వార్షిక సదస్సులో ఆమె ప్రసంగించారు. వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో చక్కని పురోగతి సాధించడానికి రెండు దేశాలకూ అవకాశాలున్నాయని చెప్పారు. శుద్ద ఇంధన సాంకేతికతల్లోనూ నాయకత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇప్పటివరకు పది సార్లు కలిశాననీ, భారత్‌లో ఆర్థిక భాగస్వామ్యానికి తాము ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని తెలిపారు.






