టెస్లా రాకతో ఆందోళన లేదు

భారత విపణిలోకి అమెరికా విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ టెస్లా అడుగుపెట్టడంపై ఆందోళన ఏమీ లేదని జర్మనీ విలాసకార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ అనుబంధ మెర్సిడెస్ బెంజ్ ఇండియా పేర్కొంది. పూర్తిగా తయారైన విద్యుత్ కార్లను తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకునే అవకాశం టెస్లాకు లభించవచ్చనే అంచనాల నడుమ ఇలా తెలిపింది.కొత్తగా తీసుకు వచ్చిన విద్యుత్ కార్ల (ఈవీ) విధానం వల్ల ప్రస్తుత సంస్థలకు రక్షణ లభిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. టెస్లా, విన్‌ఫాస్ట్ వంటి సంస్థల రాకతో భారత్‌లో విద్యుత్ కార్ల మార్కెట్ విస్తరిస్తుందని, దేశీయ విలాస విద్యుత్ కార్ల విభాగంలో అగ్రస్థానం కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్లకు సుంకాలు తగ్గించడం లేదా రద్దు చేయడం వంటివి ఆహ్వానించదగ్గ నిర్ణయాలని, భారత్‌లో స్వేచ్ఛా వాణిజ్యాన్ని ఇవి ప్రోత్సాహిస్తాయని అన్నారు.