Sundar Pichai : బిలియనీర్ క్లబ్‌లోకి సుందర్ పిచాయ్

భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ (Sundar Pichai) అరుదైన ఘనత సాధించారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) , దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet)కు సారథ్యం వహిస్తున్న సుందర్ పిచాయ్ కూడా బిలియనీర్ల జాబితాలో చేరారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 53 ఏళ్ల పిచాయ్ వ్యక్తిగత సంపద 1.1 బిలియన్ డాలర్లకు (110 కోట్ల డాలర్లు) చేరుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్లో ఆల్ఫాబెట్ షేర్లు సరికొత్త జీవనకాల గరిష్ఠానికి ఎగబాకడం ఇందుకు తోడ్పడింది. కనీసం 100 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.8,600 కోట్లు) ఆస్తి కలిగిన వారిని బిలియనీర్‌గా పిలుస్తారు. టెక్ ప్రపంచంలో వ్యవస్థాపక సీఈఓ కాని వ్యక్తి బిలియనీర్‌గా అవతరించడం అరుదైన పరిణామమే. ప్రస్తుతం పిచాయ్‌కి ఆల్ఫాబెట్‌లో 0.02 శాతానికి సమానమైన వాటా ఉంది. దాని విలువ 44 కోట్ల డాలర్లు.
తమిళనాడు (Tamil Nadu)లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సుందర్ పిచాయ్, 1993లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ (Stanford University) లో స్కాలర్‌షిప్ సాధించారు. దీంతో అక్కడే చదువు పూర్తి చేసుకున్నారు. 2004లో ఓ సాధారణ ఉద్యోగిగా గూగుల్ సంస్థలోకి అడుగుపెట్టారు. సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్(Android), గూగుల్ డ్రైవ్ ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఆయన ఆలోచనల నుంచే పుట్టుకొచ్చినవేనని చెప్పారు.