న్యూయార్క్ నుంచి లండన్ కు.. 90 నిమిషాల్లోనే
కంకార్డ్ విమానం తర్వాత ప్రయాణికులను శరవేగంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు మరో సూపర్సోనిక్ లోహవిహంగం సిద్ధమవుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా రూపొందిస్తున్న ఎక్స్-59 అనే ఈ విమానంలో న్యూయార్క్ నగరం నుంచి లండన్‌కు 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇది సైద్దాంతికంగా గంటకు 2,400 కిలోమీటర్ల నుంచి 4,900 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. పైగా కంకార్డ్లా విపరీతమైన శబ్దం చేయదు. సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించేటప్పుడు ఉత్పన్నమయ్యే కర్ణకఠోర సోనిక్బూమ్ను కలిగించకపోవడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ విమానం పెయింటింగ్ పనుల కోసం ఐటీవల కాలిఫోర్నియాలోని లాక్‌హీడ్ మార్టిన్ కర్మాగారంలో పెయింటింగ్ కేంద్రానికి వెళ్లింది. అమెరికా జాతీయ జెండాలో కనిపించే ఎరుపు, శ్వేత, నీల వర్ణాలతో ఇది దేశానికి గర్వకారణంగా నిలవబోతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక పెయింట్ తేమ, తుప్పుపట్టడం వంటి ఇబ్బందుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు.






