ఆర్‌బీఐ కీలక నిర్ణయం… ఇక గంటల్లోనే క్లియరెన్స్

డిజిటల్ యుగంలోనూ బ్యాంకింగ్ సేవల్లో ఏదైనా ఆలస్యం అవుతోంది అంటే అది చెక్కుల క్లియరెన్సే. ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి ప్రస్తుతం రెండ్రోజుల సమయం పడుతోంది. ఇతర మార్గాల్లో సత్వరమే నగదు లభిస్తున్న ఈ రోజుల్లో చెక్కులు మాత్రం రోజుల గడువు తీసుకుంటున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దీనిపై దృష్టిసారించింది. కొన్ని గంట్లోనే చెక్కు క్లియరెన్స్ జరిగేలా సంబంధిత ప్రక్రియలో కీలక మార్పును ప్రకటించింది.
ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా చెక్కులకు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు. చెక్కుల క్లియరెన్సుకు ప్రస్తుతం టీG1 విధానం అమలవుతోందని చెప్పారు. దీన్ని కొన్ని గంటలకు తగ్గించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రస్తుతం అవలంబిస్తున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ( సీటీఎస్) విధానంలో మార్పులు చేయనున్నారు. బ్యాచ్‌ల వారీగా ప్రాసెసింగ్ కాకుండా ఇకపై ఆన్ రియలైజేషన్ సెటిల్‌మెంట్ విధానాన్ని అవలంబించనున్నట్లు చెప్పారు. బ్యాంకు పని గంటల్లో చెక్కును స్కాన్ చేసి, ప్రజెంట్ చేసి, కొన్ని గంటల్లోనే పాస్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ పూర్తవుతుందని పేర్కొన్నారు.