UPI: ఆఫ్రికా దేశంలో UPI సేవలు

ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పలు దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పలు దేశాల పర్యటనలలో ఉన్న మోడీ.. నమీబియా అధ్యక్షుడు నెతుంబో నంది-న్దైత్వా మధ్య జరిగిన చర్చల అనంతరం కీలక ప్రకటన చేసారు. నమీబియా ఈ ఏడాది చివర్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను ప్రారంభిస్తుందని ప్రకటించారు. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు కీలకమైన ఖనిజాలు వంటి వాటిపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై మోడీ-నదైత్వా సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. గత సంవత్సరం ఏప్రిల్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI), మరియు బ్యాంక్ ఆఫ్ నమీబియాలు మధ్య UPI టెక్నాలజీ లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ ఏడాది చివర్లో నమీబియాలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించే అంశంపై కీలక ప్రకటన చేసారు. త్వరలోనే ఈ రెండు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం కనపడుతోంది.
ఆఫ్రికాలో కీలకంగా ఉన్న దేశాల్లో నమీబియా కూడా ఒకటి. ఆ దేశం నుంచి మన దేశంలో చిరుత పులులను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలో అంతరించిపోయిన చీతాలను ప్రత్యేక విమానాల్లో మధ్యప్రదేశ్ కు తరలించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరిన్ని అడవి జంతువులను మన దేశానికి తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేస్తోంది కేంద్రం. ఇక యూపిఐ విషయానికి వస్తే.. నమీబియా కంటే ముందు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ట్రినిడాడ్ మరియు టొబాగో మరియు మారిషస్ వంటి దేశాలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూరప్ లోని పలు దేశాల్లో కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.