ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మెకిన్సీ

గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. తన సేవలకు డిమాండ్ క్షీణించిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు తెలిసింది. డిజైన్, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్, సాఫ్ట్‌వేర్ సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది సిబ్బందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. తొలగింపులతో పాటు పలువురు ఉద్యోగుల పనితీరుపై కూడా హెచ్చరించినట్లు తెలిపింది. సుమారు 3,000 మంది ఉద్యోగులను పనితీరుతో మెరుగుదల అవసరం గురించి హెచ్చరించినట్లు తెలిసింది. వందేండ్ల కిందట అంటే 1926లో చికాగోలో ఏర్పాటైన మెకిన్సీ ప్రస్తుతం 130 దేశాల్లో తన సేవలను విస్తరించింది. మెకిన్సీలో ప్రపంచవ్యాప్తంగా 45,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021లో కంపెనీ 15 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక సంస్థ వెబ్‌సైట్ ప్రకారం, తన ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు మెకిన్సీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని చూస్తోంది.