ఇండిగో కీలక నిర్ణయం… నవంబరు నుంచి

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. నవంబరు మధ్య నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న బిజినెస్ క్లాస్ టికెట్లు ఈ నెల 6 నుంచే బుకింగ్‌ను అందుబాటులోకి వస్తాయని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా మాత్రమే దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇండిగో బ్లూచిప్ పేరిట కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.