భారత్, అమెరికా మధ్య ట్రేడ్ పాలసీ ఫోరం సమావేశం
ఇరు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతుల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను చేర్చడంపై భారత్, అమెరికా దృష్టి సారించాయి. ఈ ప్రయత్నాలు ఫలవంతమైతే భారత్ నుంచి అమెరికాకు మామిడి, దానిమ్మ ఎగుమతి చేయడానికి, అక్కడ నుంచి చెర్రీ పళ్లను దిగుమతి చేసుకోవడానికి వీలు కానుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని జరిపిన భేటీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) కేథరిన్ టై అంగీరించారు. అలాగే ఇతరత్రా వాణాజ్యింశాలను కూడా వారు చర్చించారు. నాలుగేళ్లలో తొలిసారిగా జరిగిన భారత్, అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరం (టీపీఎఫ్) 12వ మంత్రుల స్థాయి సమావేశానికి వారు సహ, సారథ్యం వహించారు. మామిడి, దానిమ్మ పళ్ల ఎగుమతులకు తోడ్పడేందుకు అవసరమైన చర్యలను అమెరికా తీసుకోనున్నట్లు అలాగే అక్కడి నుంచి చెర్రీలు, పశువుల ఆహారం ఆల్ఫా ఆల్ఫా ఎండుగడ్డిని దిగుమతి చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికేషన్ ప్రక్రియను భారత్ ఖరారు చేయనున్నట్లు ఇరు వర్గాలు తెలిపాయి.






