India-US: తుది దశకు భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందం?.. మళ్లీ అమెరికాకు భారత బృందం

భారత్, అమెరికాల (India-US) మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. గతంలో పలుమార్లు చర్చలు జరిగినా ఈ ఒప్పందంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో వచ్చే వారం భారత ప్రతినిధి బృందం అమెరికా (USA) పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పర్యటన ప్రధానంగా వ్యవసాయ రంగంపై చర్చలకు కేంద్ర బిందువు కానుంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. భారత (India) చర్చల బృందానికి చీఫ్ నెగోషియేటర్, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ (Rajesh Agarwal) నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం ఇప్పటికే మూడుసార్లు వాషింగ్టన్‌ను సందర్శించింది. నాలుగోసారి పర్యటించనుండటంతో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. భారత్, అమెరికా (India-US) మధ్య వాణిజ్య సంబంధాలకు ఈ పర్యటన అత్యంత కీలకమని నిపుణులు భావిస్తున్నారు.