భారత్ తో సమీకృత ఫుడ్ పార్కులు
కొత్తగా ఏర్పడిన నాలుగు దేశాల కూటమి ఐటూ యుటూ నిబంధనావళి కింద దేశవ్యాప్తంగా సమీకృత ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఈ కూటమిలో సభ్య దేశమయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యుఎఇలు సభ్య దేశాలుగా ఈ ఐటూ యుటూ కూటమి ఏర్పడిరది. ఈ దేశాలకు చెందిన నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్ లాపిడ్, యుఎఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేవద్ ఆల్ నహాన్ తొలి వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునన్నారు.
అంతేకాకుండా గుజరాత్లో 300 మెగావాట్ల పవన్, సౌర విద్యుత్ ఉత్పత్తి, సామర్థ్యం కలిగిన ఒక హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును కూడా ఈ గ్రూపు ఏర్పాటు చేస్తుంది. దీనితో పాటు బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కొత్త కూటమి ఏర్పాటయింది. ఇండియా, ఇజ్రాయెల్‌లు ఐటూకు ప్రాతినిధ్యం వహిస్తుండగా అమెరికా, యుఎఇలకు యుటూ ప్రాతినిధ్యం వహిస్తుంది. కాగా ఈ కూటమి తన తొలి సమావేశంలోనే ఒక సానుకూల అజెండాను ఏర్పాటు చేసుకుందని, ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఈ కూటమి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఈ సంద్భంగా మోదీ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న అనిశ్చితుల నేపథ్యంలో ఈ గ్రూపునకు చెందిన సహకారంతో కూడిన నిబంధనావళి ఆచరణాత్మక సహకారానికి ఓ చక్కటి ఉదాహరణ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.






