Priya Nair: హెచ్‌యూఎల్‌కు ప్రియా నాయర్ నాయకత్వం..
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రియా నాయర్ నియమితులయ్యారు. ఆగస్టు 1 నుంచి ఐదేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం యూనిలీవర్‌లో బ్యూటీ, వెల్‌బీయింగ్ విభాగానికి ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న రోహిత్ జావా వ్యక్తిగత కారణాల రీత్యా జులై 31తో తన బాధ్యతల నుంచి తప్పుకొంటున్నారు. ఆపై ప్రియా నాయర్ సంస్థను ముందుండి నడిపించనున్నారు. యూనిలీవర్ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉంటూనే.. హెచ్‌యూఎల్ బోర్డులో సభ్యులుగా చేరనున్నారు.
ప్రియానాయర్ ప్రస్థానం…
దాదాపు 30 ఏళ్లుగా హిందుస్థాన్ యూనిలీవర్‌కు ప్రియా నాయర్ సేవలందిస్తున్నారు. 1995లో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగంలో చేరిన ఆమె.. అంచెలంచెలుగా ఎదిగి హెచ్‌యూఎల్‌లో హోమ్‌కేర్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 2014 నుంచి 2020 వరకు ఆ విభాగంలో సేవలందించారు.
2020 నుంచి 2022 వరకు బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తర్వాత యూనిలీవర్‌లో బ్యూటీ, వెల్‌బీయింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా, 2023 నుంచి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారతీయ మార్కెట్‌పై తనకున్న అవగాహన, ఆమె ట్రాక్ రికార్డు కారణంగా హెచ్‌యూఎల్‌ను మరోస్థాయికి తీసుకెళ్లగలరని హెచ్‌యూఎల్ ఛైర్మన్ నితిన్ పరాంజిపే విశ్వాసం వ్యక్తంచేశారు.








