Tesla: భారత్ లోకి టెస్లా ఎంట్రీ.. ముంబైలో తొలి షోరూమ్..
భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలన్న టెస్లా (Tesla) ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ కల నెరవేరింది. అమెరికాకు చెందిన ఈ కార్ల కంపెనీ తన తొలి షోరూమ్ ను..ముంబై (Mumbai) లో ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మార్కర్ మ్యాక్సిటీ మాల్లో దానిని తెరిచింది. ఈసందర్భంగా ‘మోడల్ వై’ కారును సంస్థ ఆవిష్కరించింది.
‘మోడల్ వై’ ధర, ఫీచర్స్..
తొలుత ‘మోడల్ Y’ ఈవీలను టెస్లా భారత్ మార్కెట్లో విక్రయించనుంది. ఇక్కడ ఆర్డబ్ల్యూడీ వెర్షన్ (బేస్) ‘మోడల్ వై’ ధర రూ.61.07 లక్షలుగా (ఆన్‌రోడ్) నిర్ణయించింది. లాంగ్-రేంజ్ వెర్షన్ ధర రూ.69.15లక్షలుగా ఉంది. బేస్ మోడల్ ధర అమెరికాలో 44,990 డాలర్లు (రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్లు (రూ.31.57లక్షలు) జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09లక్షలు)గా ఉంది. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చుల కారణంగా భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉంది.
కొన్నిరోజుల క్రితం భారత రోడ్లపై ‘మోడల్ Y’ ను పరీక్షించడం జరిగింది. ముంబయి-పుణే జాతీయరహదారిపై ఈ వాహనం దర్శనమివ్వడం చూపరులను ఆకర్షించింది. ఇది పూర్తిగా అప్డేట్ అయిన మోడల్ Y కారుగా నిపుణులు గుర్తించారు. దీని కోడ్‌నేమ్ జునిపెర్. సాధారణ మోడల్ Y కంటే దీనిలో ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. అమెరికా, కెనడా మార్కెట్లలో వీటిని విక్రయిస్తున్నారు. దీని సీ షేప్‌లోని ఎల్ఈడీ లైట్లు, ట్విన్ స్పోక్ అలాయ్ వీల్స్, టెస్లా ప్రత్యేకతను తెలిపే గ్లాస్ రూఫ్ ఉన్నాయి. ఇది భారత్‌లో ఆరు రంగుల్లో లభించవచ్చని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మోడల్ Y కారు ఆల్‌వీల్ డ్రైవ్‌గా లభిస్తోంది. వీటిల్లో లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జి చేస్తే 500-600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం 4.6 సెకన్లలో గంటకు 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకొంటుంది. అత్యధికంగా గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. దీనిలో భారీ 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను అమర్చారు. వెనక సీట్లలోని ప్యాసింజర్ల కోసం 8 అంగుళాల ప్రత్యేకమైన స్క్రీన్ కూడా ఉంటుంది. అడాస్ ఫీచర్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి హంగులు ఇందులో కస్టమర్లకు లభించనున్నాయి.








