ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం…
దిగ్గజ సామాజిక మాధ్యం ఎక్స్ లో వాణిజ్య ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం పడిపోతున్న నేపథ్యంలో దాని అధిపతి ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వేదికపై షేర్ చేసే లింక్స్ కు సంబంధించిన హెడ్లైన్లు కనిపించేలా తిరిగి మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, గతంలో వలే కాకుండా ఇకపై ఇమేజ్‌లపైనే లింక్‌కు సంబంధించిన హెడ్లైన్ కనిపిస్తుందని పేర్కొన్నారు. పునరుద్ధరిస్తున్న ఈ హెడ్లైన్ ఆప్షన్‌కు సంబంధించి ఎలాన్ మస్క్ ఇతర వివరాలను వెల్లడించలేదు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అసలు ఇమేజ్‌పై హెడ్‌లైన్‌ను ఎలా చూపించనున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. లింక్ ప్రివ్యూలకు సంబంధించిన హెడ్లైన్లు కనిపించకుండా ఎక్స్ లో అక్టోబరులో మార్పులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల వ్యవధిలోనే తిరిగి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుండటం గమనార్హం.






