టీఎస్ఐపాస్తో టూరిజంశాఖ అనుసంధానం
తెలంగాణ ప్రభుత్వం పర్యాటకశాఖను అభివృద్ధిపరుస్తోందని, అందులో భాగంగా పర్యాటక శాఖనూ టీఎస్ ఐపాస్‌తో అనుసంధానం చేసిందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు, టీఎస్ బీపాస్ ద్వారా ఇళ్ళ నిర్మాణానికి సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం పర్యాటక శాఖనూ టీఎస్ ఐపాస్‌తో అనుసంధానం చేయడం గమనార్హం. ట్రావెల్ ఏజెన్సీలు, ఈవెంట్ మేనేజ్మెంట్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు దీనిద్వారా 30 రోజుల నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయనుంది. నిర్దేశిత గడువు దాటితే డీమ్డ్ అప్రూవల్ పొందేలా నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకు సంబంధించిన వెబ్‌పోర్టల్‌ను హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. టీఎస్ ఐపాస్ విధానానికి తెలంగాణపర్యాటక శాఖ సేవలను అనుసంధానం చేయడం మంచి పరిణామమని అన్నారు.
మలేషియా, సింగపూర్ తదితర దేశాలు పర్యాటక ఆదాయంపైనే అభివృద్ధి సాధిస్తున్నాయని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో తెలంగాణ టూరిజం మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు. రామప్ప లాంటి ప్రముఖ ఆలయాలు ప్రపంచ పర్యాటక పటంలోకి త్వరలోనే చేరుతాయని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సాగునీటి జలాశయాల వద్ద కూడా టూరిస్ట్ స్పాట్లను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, టీఎస్‌టీడీసీ ఈడీ శంకర్‌రెడ్డి, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, ఈవెంట్స్ మేనేజర్లు, టూరిజం అధికారులు మహేశ్, ఓం ప్రకాశ్, శశిధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫెసిలిటేషన్-2020 గైడ్‌లైన్స్ ను విడుదల చేశారు. ఔత్సాహికులు తమ ప్రాజెక్టు/టూర్ ఏజెన్సీ/ఈవెంట్ సంబంధిత వివరాలతోపాటు, గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్, నివాసం తదితర నిర్దేశిత ధ్రువపత్రాలతో ఆన్లైన్ ద్వారా టీఎస్ఐపాస్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 30 రోజులు దాటిన తర్వాత దరఖాస్తుదారుడికి ఆటోమెటిక్‌గా డీమ్డ్ అప్రూవల్ వచ్చేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. టూరిజం విభాగానికి సంబంధించి ట్రావెల్ ఏజెన్సీ, టూర్ ఆపరేటర్ సర్వీసుల నిర్వహణకు రూ.1500, టూరిజం ఈవెంట్ల నిర్వహణకు రూ.2,000 సాధారణ యూజర్ చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. హోటల్, రెస్టారెంట్ల నిర్వహణ, నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు వ్యయాన్ని బట్టి కనిష్ఠంగా రూ.500, గరిష్ఠంగా రూ.25,000 వరకు ప్రభుత్వానికి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.






