2028కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాదే. అయితే అగ్రరాజ్యాన్ని డ్రాగన్ దేశం దాటి వేయనున్నది. 2028లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలుస్తుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్ మమహ్మారి నుంచి అమెరికా, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్న తీరు ఆధారంగా ఆ సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. కోవిడ్ 19 మహమ్మారి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ సన్నగిల్లిందని, దీంతో ప్రత్యర్థి చైనా దూసుకువెళ్తున్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది. వైరస్ మహమ్మారిని చైనా చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నదని, కఠినమైన లాక్డౌన్ విధించడం వల్ల ఆ దేశ ఆర్థిక వృద్ధి పెరిగిందని సీఈబీఆర్ పేర్కొన్నది.
2021 నుంచి 2025 వరకు చైనా ఆర్థిక వృద్ధి 5.7 శాతంగా ఉండనున్నది. ఆ తర్వాత 2026 నుంచి 2030 వరకు ఆ వృద్ధి 4.5 శాతానికి పడిపోనున్నది. మరోవైపు వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా కోలుకోనున్నా.. ఆ తర్వాత మాత్రం 2022 నుంచి 2024 వరకు వృద్ధి కేవలం 1.9 శాతానికి పడిపోనున్నది. ఆ తర్వాత వృద్ధి రేటు మరింత దిగజారి అది 1.6 శాతానికి ఫిక్స్ కానున్నది. అయితే డాలర్ల అంశంలో పోలిస్తే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ నిలువనున్నది.






