తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద పెట్టుబడి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్ సంస్థ తమ రెండో వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకొన్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దాదాపు రూ.20,761 కోట్ల (2.77 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ ముందుకొచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. క్లౌడ్ ఇన్ఫాస్ట్రక్చర్ రంగంలో పేరుగాంచిన అమెరికాకు చెందిన అమెజాన్ వెబ్సర్వీసెస్ హైదరాబాద్‌ను భారత్‌లో తమ రెండో ఏడబ్ల్యూఎస్ రీజియన్‌గా ఎంచుకున్నదని తెలిపారు.
ఈ సెంటర్ 2022లో అందుబాటులోకి తెస్తామని అమెజాన్ సంస్థ ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో జరిగిన వచ్చువల్ సమావేశంలో అమెజాన్ సంస్థ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అమెజాన్ సంస్థతో తాను వరుసగా జరిపిన సమావేశాల కృషి ఫలితమే ఈ పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాదర్శక, వేగవంతమైన విధానాల వల్లనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అమెజాన్ లాంటి ప్రఖ్యాత సంస్థ ఇంత భారీ ఎత్తున తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ ఆకర్షణీయ కేంద్రంగా మారే అవకాశమున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమెజాన్ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏర్పాటవుతున్న అమెజాన్ వెబ్సర్వీసెస్ లాంటి డాటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ, ఐటీ రంగం మరింత వృద్ధి చెందనున్నాయి. దీంతో డెవలపర్లు, స్టార్టప్‌లకు మరింత ఊతం లభించనుంది. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో యువతకు ఉపాధి లభించనుంది.






