ASBL NSL Infratech

రివ్యూ: సరికొత్త పాయింట్ తో రాజ'శేఖర్'

రివ్యూ: సరికొత్త పాయింట్ తో రాజ'శేఖర్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు :  పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్
నటీనటులు : రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు....
సినిమాటోగ్రాఫర్ :మల్లికార్జున్ నారగాని, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్ : సంపత్,
మాటలు : లక్ష్మీ భూపాల, సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ,
నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం
 స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్
విడుదల తేదీ : 20.05.2022

యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌.. రెండు దశాబ్దాల క్రితం స్టార్‌ హీరోల్లో ఒక్కడు. అప్పట్లో ఆయన సినిమాలు రికార్డులు సృష్టించాయి. అంకుశం, ఆహుతి మగాడు. ఇటీవల గరుడవేగా వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్‌తో మెప్పించిన రాజ‌శేఖ‌ర్ .. అక్క మొగుడు, గోరింటాకు వంటి ఎమోష‌న‌ల్ చిత్రాల‌తోనూ ఆక‌ట్టుకున్నారు. గ‌రుడ‌వేగ చిత్రంతో మ‌ళ్లీ యాంగ్రీ స్టార్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ న‌టించిన తాజా చిత్రం ‘శేఖర్’. మలయాళంలో విజయవంతమైన జోసెఫ్ చిత్రాన్ని తెలుగులోకి ‘శేఖర్’ పేరుతో రీమేక్ చేశారు. రాజశేఖర్‌ సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఆయ‌న లుక్‌, పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్ని సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. మ‌రి శేఖ‌ర్ సినిమా రాజ‌శేఖ‌ర్‌కు మ‌రో స‌క్సెస్‌ను తెచ్చి పెట్టిందా? రాజ‌శేఖ‌ర్ స‌ద‌రు శేఖ‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయారా? అస‌లు శేఖ‌ర్ సినిమా ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే  రివ్యూ లో చూద్దాం 

కథ:

శేఖర్‌(రాజశేఖర్‌)..ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌లో దిట్ట. నేరస్తులను ఎవరైనా సరే..ఇట్టే కనిపెట్టేస్తాడు. ఓ మర్డర్‌ కేసులో పోలీసులు అతని సహాయం తీసుకుంటారు. అదే సమయంలో అతని భార్య ఇందు(ఆత్మీయ రాజన్‌) ప్రియురాలు కిన్నెరా (ముస్కాన్) కూతురు గీత (శివాని రాజ‌శేఖ‌ర్‌) మరణాలు వాళ్ళతో గడిపిన తీపి జ్ఞాపకాలు శేఖర్‌ని వెంటాడుతుంటాయి. ఇందులోభాగంగా  ఓ రోజు విడాకులు తీసుకున్న భార్య ఇందు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలియడంతో శేఖర్‌ ఆస్పత్రికి వెళ్తాడు. దురదృష్టవశాత్తు ఇందు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందుతుంది. ఈ కేసుపై శేఖర్‌కి అనుమానం రావడంతో వెంటనే విచారణ ప్రారంభిస్తాడు. ఇన్వెస్టిగేషన్‌లో ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఎవరో హత్య చేశారని తెలుస్తుంది.అసలు ఇందుని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ కేసును శేఖర్‌ ఎలా ఛేదించాడు? ఇందు నుంచి శేఖర్‌ విడిపోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే.. ‘శేఖర్‌’ సినిమా చూడాల్సిందే. 

నటీనటుల హావభావాలు:

రాజ‌శేఖ‌ర్ సినిమాను అంతా తానై న‌డిపించారు.యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌ నటనలో ఇప్పటికి జోష్‌ తగ్గలేదు. రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ శేఖర్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో అయితే అద్భుతంగా నటించారు. ఆయన కంటతడి పెట్టిన ప్రతిసారి.. ప్రేక్షకుడి హృదయం బరువెక్కుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌లో తెరపై యంగ్‌గా, స్టైలీష్‌గా కనిపించాడు. ‘కిన్నెర’ పాటలో అయితే ఒకప్పటి రాజశేకర్‌ని చూస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమాలో క‌నిపించ‌ని ఓ ర‌గ్డ్ లుక్‌లో క‌నిపించారు. ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన‌ట్లు అక్క మొగుడు, మా అన్న‌య్య‌, గోరింటాకు వంటి ఎమోష‌న‌ల్ సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన రాజ‌శేఖ‌ర్ ఈ శేఖ‌ర్ సినిమాలోనూ ఎమోష‌న‌ల్ సీన్స్‌లో ఒదిగిపోయారు.  ఇక హీరో భార్య ఇందు పాత్రకి ఆత్మీయ రాజన్‌ న్యాయం చేశారు.  శేఖర్‌ కూతురు గీత పాత్రలో శివాణి ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు కీలకం. హీరో స్నేహితులుగా సమీర్‌, అభినవ్‌ గోమతం, కన్నడ కిశోర్‌,  ప్రియురాలు  కిన్నెరగా ముస్కాన్‌ ఆకట్టుకున్నారు. పొసాని కృష్ణమురళితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

ద‌ర్శ‌కురాలిగా జీవితా రాజ‌శేఖ‌ర్ సినిమాను చ‌క్క‌గా హ్యాండిల్ చేశారు. ఎక్క‌డా హీరో పాత్ర‌కు హీరోయిజాన్ని ఎక్కువ‌గా ఆపాదించాల‌ని కాకుండా మాతృక‌లో ఉన్న‌ట్లే చిత్రీక‌రిస్తు వ‌చ్చారు. ఎలాంటి భంగం కలకుండా..తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు.  ఆ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘శేఖర్‌’ కథ ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి కలిగింది.   కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాతృకకు   ఇక ఎమోష‌న‌ల్ విష‌యాల‌ను క‌నెక్ట్ కావ‌డానికి ఆ స‌న్నివేశాల‌పై ఫోక‌స్ పెట్టారు. ‘ఈ యుద్ధంలో బ‌లి కోరే కృష్ణుడిని నేనే.. బ‌ల‌య్యే భీష్ముడినీ నేనే’ అంటూ సందర్భానుచితంగా వచ్చే డైలాగ్స్ బావున్నాయి. సాంకేతిక విషయాలకు వస్తే తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఎమోష‌నల్ సీన్స్ క‌నెక్టింగ్ అయ్యేలా చేయ‌టంలో అనూప్ రూబెన్స్‌ స‌క్సెస్ అయ్యారు. మ‌ల్లిఖార్జున్ నాగ‌రాణి సినిమాటోగ్ర‌ఫీ ఓకే. మ‌ల‌యాళంలో సినిమా స్లోగా అనిపిస్తుంది. కానీ తెలుగులో ఆ స‌మ‌స్య లేకుండా చూసుకున్నారు. నటుడు సాయి కుమార్ డబ్బింగ్ తో  మరో సారి సక్సెస్ అయ్యాడు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.   

విశ్లేషణ:

క్రైమ్‌ థ్రిల్లర్‌, ఇన్వెస్టిగేటివ్‌ చిత్రాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమే. అందుకే ఆ జానర్‌ చిత్రాలు ఎక్కువగా హిట్‌ అవుతుంటాయి. కథ, కథనం ట్విస్టులతో ఉత్కంఠంగా సాగితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడతారు. ‘శేఖర్‌’లో ఆ ఉత్కంఠత కాస్త తగ్గింది.  అవ‌య‌వ దానం అనే కాన్సెప్టులో జ‌రుగుతున్న మోసాల‌ను బ‌హిర్గ‌తం చేసే క‌థాంశంతో రూపొందిన సినిమా శేఖ‌ర్‌. మెయిన్ ప్లాట్ అనే దాన్ని ఎలా ఎలివేట్ చేయాలో రైట‌ర్‌కి బాగా తెలుసు. కానీ దాని చుట్టూ అల్లుకున్న క‌థ చాలా ముఖ్యం. చూసే ప్రేక్ష‌కుడికి ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో సినిమా క‌నెక్ట్ కావాలి. అందుక‌నే ఓ కుటుంబం.. ఆ కుటుంబాన్ని అధికంగా ప్రేమించే వ్య‌క్తి. అనుకోని ప‌రిస్థితుల్లో భార్యాభ‌ర్త‌లు విడిపోవ‌టం.. కూతురు చ‌నిపోవ‌టం ఇలాంటి ఎలిమెంట్స్‌ను కోర్ పాయింట్ చుట్టూ అల్లుకుంటూ వ‌చ్చారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తోనే ఫ‌స్టాఫ్‌ను న‌డిపించారు. ఒకరి బాగు కోసం మరోకరు చేసే త్యాగం..అందరిని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోవడమే కాకుండా.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే..హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వ్యవస్థలో ‘ఆర్గనైజ్‌డ్‌ మెడకల్‌ క్రైమ్‌’ ఎలా జరుగుతుందో ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. వైద్యరంగంలో ఇలాంటి స్కామ్‌లు కూడా ఉంటాయా? అని సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. స్కామ్‌ని బయటపెట్టేందుకు హీరో తీసుకునే సంచలన నిర్ణయం కాస్త సినిమాటిక్‌గా అనిపించినా.. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌ రాజ్‌ ఇచ్చిన వివరణతో ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు.వెంకటేష్  'దృశ్యం' చిత్రం చూస్తున్నపుడు ఓ కొత్త తరహా చిత్రం అనిపించినట్లే  ఈ చిత్రం చూస్తుంటే అలాంటి అనుభూతి కలుగుతుంది.  

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :