ASBL NSL Infratech

రివ్యూ : రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ 'భళా తందనాన'

రివ్యూ : రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ 'భళా తందనాన'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
బ్యానర్‌: వారాహి చలనచిత్రం
నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్‌, గరుడ రామ్‌, పొసాని కృష్ణమురళి, సత్య తదితరులు
సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుతు
ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌, స్టంట్స్: పీటర్ హెయిన్ 
ఆర్ట్ - గాంధీ నడికుడికార్, కథ, డైలాగ్స్‌: శ్రీకాంత్‌ విస్సా, సమర్పణ: సాయి కొర్రపాటి,
నిర్మాత: రజనీ కొర్రపాటి, దర్శకుడు: చైతన్య దంతులూరి
విడుదల తేది: 06.05.2022 


కొత్త కథలు, కొత్త దనం కోసం, డిఫరెంట్‌ కాన్సెప్టులకు ఎప్పుడు పరుగులు తీస్తుంటాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. అంతేకాదు, తెలుగు భాషపై మమకారంతో తన సినిమాలన్నింటికీ దాదాపు తెలుగు టైటిల్స్‌ ఉండేలా చూసుకుంటాడు. వీరభోగ వసంతరాయలు, బ్రోచేవారెవరు రా! తిప్పరా మీసం, రాజా రాజా చోర, అర్జునా పాల్గుణ... అలా అన్నమయ్య కీర్తనలో ఉన్న భళా తందనానా అనే పదాన్ని తీసుకుని అదే టైటిల్‌తో సినిమా చేశాడు. ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు శ్రీవిష్ణు. మరి ఈ మూవీ శ్రీవిష్ణుకి విజయాన్ని అందించిందా? తన సినిమాతో ప్రేక్షకుడికి కొత్తదనం పంచాడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

క‌థ :
విజ‌యానందం చారిట‌బుల్ ట్ర‌స్ట్‌లో చందు (శ్రీవిష్ణు) అకౌంటెంట్‌గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఆ ట‌స్ట్ ఓన‌ర్ (పోసాని)కి సోసైటీలో చాలా మంచి పేరుంటుంది. త‌న‌కు క్రైమ్ జ‌ర్న‌లిస్ట్ శ‌శిరేఖ (క్యాథిర‌న్ ట్రెసా)తో ప‌రిచ‌యం అవుతుంది. ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెకు కూడా చందు మ‌న‌సుని అర్థం చేసుకుని ప్రేమిస్తుంది. అదే స‌మ‌యంలో సిటీలోనే పేరు మోసిన వ్య‌క్తి ఆనంద్ బాలి(రామచంద్ర‌రాజు). అత‌నొక హ‌వాలా కింగ్‌. రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించేలా మ‌నీ హ‌వాలాను న‌డిపిస్తుంటాడు. ఆ విష‌యం ప్రభుత్వానికి, డిపార్ట్ మెంట్ కు తెలిసినా ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. అందుకు కార‌ణం.. అత‌నికున్న ప‌లుకుబ‌డి. అలాంటి వ్య‌క్తికి సంబంధించిన మ‌నుషుల‌ను ఎవ‌రో ఒక‌రు ఘోరంగా చంపేస్తుంటారు. క్రైమ్ జ‌ర్న‌లిస్ట్‌గా ఈ హ‌త్య‌ల వెనుక ఎవ‌రున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది శ‌శిరేఖ‌. ఆమెకు చందు సాయం చేస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో ఆనంద్ బాలికి సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయ‌ల హ‌వాలా మ‌నీని ఎవ‌రో దొంగిలించార‌నే విష‌యం శ‌శిరేఖ‌కు తెలుస్తుంది. ఆమె దానిపై ఓ వార్త రాస్తుంది. ఆ వెంట‌నే కొంద‌రు వ్య‌క్తులు వ‌చ్చి చందుని కిడ్నాప్ చేస్తారు. అస‌లు చందుని కిడ్నాప్ చేసిందెవ‌రు? చందు ఏం చేసుంటాడు? సిటీలో జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు.. మ‌నీ హ‌వాలాకి సంబంధం ఉందా? ఉంటే ఏంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే మిగతా కథ కోసం సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:
శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో అమాయక చక్రవర్తిగా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే.. ఇందులో శ్రీవిష్ణు నటనలో పరిణితి కనిపించింది. ఇక ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుగా కేథరిన్‌ మెప్పించే ప్రయత్నం చేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేథరిన్‌.. తెరపై కాస్త బొద్దుగా కనిపించింది. ఇక ఈ సినిమాకు ఆమే డబ్బింగ్‌ చెప్పుకుంది. అయితే అది కాస్త నప్పలేదు. ‘మేడమ్‌ మీరు మాట్లాడే తెలుగు.. ఇంగ్లీష్‌లా ఉంటుంది’ అని హీరోతో ఓ డైలాగ్‌ చెప్పించి.. ప్రేక్షకులను కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేశారు. ఇక విలన్‌గా గరుడ రామ్‌ మెప్పించాడు. అయితే అతనికి బలమైన సీన్స్‌ లేకపోవడం మైనస్‌. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న దయామయం పాత్రలో పొసాని కృష్ణమురళి ఒదిగిపోవడమే కాకుండా..తనదైన కామెడీతో నవ్వించాడు. ఫస్టాఫ్‌లో సత్యతో వచ్చే కామెడీ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు తమ, తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతికవర్గం పనితీరు:
బాణం, బసంతి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న చైతన్య దంతులూరి.. చాలా గ్యాప్‌ తర్వాత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో ‘భళా తందనాన’ తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. క్రైమ్‌ థ్రిల్లర్‌కి కామెడీ, ప్రేమను యాడ్‌ చేసి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే సినిమాకు కాస్త మైనస్‌ అయింది. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఉత్కంఠ రేకెత్తించే సీన్స్‌ ఉన్నప్పటికీ.. కామెడీ, లవ్‌ ట్రాక్‌ కారణంగా రొటీన్‌ సినిమాగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ కిడ్నాప్‌ జరగడం..దానిని కనెక్ట్‌ చేస్తూ అసలు కథను ప్రేక్షకులకు చెప్పడంతో ఈ విషయం లో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు మరో ప్రధానబలం మణిశర్మ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సురేశ్‌ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.  

విశ్లేషణ:
డ్రగ్స్ కేసులో దొరికితే ఓ ఇర‌వై ఏళ్లు జైలు శిక్ష ప‌డుతుంది.. హ‌త్య చేశామ‌నుకో ఉరి శిక్ష ప‌డుతుంది.. అదే బ్లాక్ మ‌నీతో ప‌ట్టుబ‌డితే ఏంతో కొంత ఫైన్ క‌ట్టించుకుని వ‌దిలేస్తారు. అందుకే కొంద‌రు వ్య‌క్తులు మ‌న దేశంలో మ‌నీ హ‌వాలాను ఎలాంటి భ‌యం లేకుండా ర‌న్ చేస్తుంటారు... అనే పాయింట్ మీద డైరెక్ట‌ర్ చైత‌న్య దంతులూరి రాసుకున్న క‌థే ‘భళా తందనాన’ వరుస హత్యలు.. హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌తో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. పాట రూపంలో హీరో చెప్పే లవ్‌ ఫెయిలర్‌ స్టోరీ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథంతా రూ. 2000 కోట్ల హవాలా మనీ చుట్టే తిరుగుతుంది. ఆ డబ్బుతో చందుకు ఉన్న సంబంధం ఏంటి? అది ఎక్కడా దాచారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి కలుగుతుంది. క్లైమాక్స్‌ కొత్తగా ఉన్నప్పటికీ.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు? అతని గతం ఏంటి? రూ. 2000 కోట్లు ఎక్కడ దాచాడు? కంక్లూషన్ ఇవ్వకుండా... .. రెండో భాగం ఉందని చెప్తూ కథని ముగించాడు. మొదటి భాగమే సో సో అంటే ఇక రెండో భాగం కూడానా? 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :