No Kings: ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా యూఎస్ వ్యాప్తంగా ‘నో కింగ్స్’ నిరసనలు!

రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తూ, సంస్కరణల పేరుతో వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేయడంపై అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, అమెరికన్లు అక్టోబర్ 18న దేశవ్యాప్తంగా ‘నో కింగ్స్’ (No Kings) పేరుతో మరోసారి భారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. దేశంలోని యాభై రాష్ట్రాల్లో సుమారు 2,500లకు పైగా ప్రదేశాల్లో ఈ నిరసనలు జరిగాయి. పలు ఐరోపా దేశాల్లోనూ ఈ ఆందోళనలకు మద్దతుగా కార్యక్రమాలు జరిగాయి.
పాలనా సంస్కరణల నెపంతో ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలో ‘డోజ్’ను ఏర్పాటు చేసి వేలాది మంది ఉద్యోగులను తొలగించడం, జన్మతః పౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వలసలు వంటి అంశాల్లో ట్రంప్ (Donald Trump) తీసుకున్న కీలక మార్పులు ఈ నిరసనలకు ప్రధాన కారణమయ్యాయి. వలసదారులను అధికారుల టార్గెట్ చేయడం వివాదాస్పదంగా మారగా, నిరసనకారులను అడ్డుకునేందుకు ట్రంప్ యంత్రాంగం అనేక రాష్ట్రాల్లో జాతీయ బలగాలను మోహరించడం ఆందోళనలకు మరింత ఆజ్యం పోసింది. ‘అమెరికాలో రాజులు లేరు’ (No Kings In America) అని నినదిస్తూ.. అవినీతి, క్రూరత్వానికి వ్యతిరేక పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని నిరసనకారులు తమ ప్రత్యేక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.