Donald Trump: డబ్బులతో గ్రీన్ లాండ్ ను కొనేద్దాం.. ట్రంప్ మదిలో వినూత్న ఆలోచన…!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంతుచిక్కని వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఏ అధ్యక్షుడు మాట్లాడని, ప్రవర్తించని విధంగా ట్రంప్ ప్రవర్తన సాగుతోంది. ఇందులో అంతర్జాతీయ చట్టాలు, పొరుగుదేశాలతో మైత్రీబంధం ఏదీ.. ఆయనకు పట్టదు.. ఆ విషయాన్ని ట్రంప్ నేరుగా స్పష్టం చేశారు కూడా. దీంతో ట్రంప్ .. పక్కా వాణిజ్య వేత్తలా వ్యవహరిస్తున్నారన్న సంగతి ప్రపంచానికి అర్థమవుతోంది. ఓ వాణిజ్యవేత్త.. తనకు లాభం కలిగేదాన్ని ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేస్తాడు. నయానో, భయానో లేదా డబ్బిచ్చో తనదాన్ని చేసుకుంటాడు. ట్రంప్ సైతం అలానే ప్రవర్తిస్తూ.. ప్రపంచనేతలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
వెనుజువెలా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్లాండ్ స్వాధీనం గురించి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆరు నూరైనా.. ఆ ద్వీప దేశాన్ని ఎలాగైనా యూఎస్‌లో విలీనం చేస్తామని తేల్చి చెబుతున్నారు. దీనిలో భాగంగా ముందుగా దాన్ని డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు.. గ్రీన్లాండ్ వాసులకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది (Trump offers cash to Greenland people).
వాటి ప్రకారం.. డెన్మార్క్ నుంచి విడిపోయి యూఎస్‌తో కలిసిపోయేలా ఒప్పించేందుకు గ్రీన్లాండ్ వాసులకు ప్రత్యక్ష నగదు చెల్లింపులపై ట్రంప్ (Donald Trump) పరిపాలనాధికారులు చర్చలు జరిపారు. ఒక్కో వ్యక్తికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల (భారత కరెన్సీలో రూ.8 లక్షల నుంచి రూ.89 లక్షల) మధ్య డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేశారు. గ్రీన్లాండ్లో మొత్తం 57వేల మంది ప్రజలు ఉన్నారు. వీరికి నేరుగా ఈ చెల్లింపులు జరపాలనే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేనట్లు తెలుస్తోంది.
ఇక, యూఎస్ నగదు చెల్లింపు ప్రణాళికలను గ్రీన్లాండ్ (Greenland) నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ పేర్కొన్నారు. నాటో దేశాలు కూడా యూఎస్ ప్రణాళికపై ఆందోళన వ్యక్తంచేశాయి.
నాకు నేనే చట్టం.. అంతర్జాతీయ చట్టాలతో పనిలేదన్న ట్రంప్..
ప్రపంచవ్యాప్తంగా సైనిక చర్యలకు ఆదేశించే అధికారంపై తన సొంత నైతికతే ఏకైక పరిమితి అని ట్రంప్ అన్నారు. గ్లోబల్ పవర్స్‌పై మీకు ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. తనకు అంతర్జాతీయ చట్టాలతో పని లేదని, ప్రజలు బాధపడటాన్ని తాను చూడలేనన్నారు. ఈ సందర్భంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం యూఎస్‌కు అవసరమని స్పష్టం చేశారు ట్రంప్.






