ఇళ్లకు డిమాండ్… ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్ సందడి

దేశంలో సొంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ ప్రధాన నగరాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) టాప్30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 11 శాతం పెరిగి 2,07,896 యూనిట్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్ ఈక్విటీ’ తెలిపింది. 2022-23 సంవత్సరంలో 1,86,951 యూనిట్లు విక్రయం కావడం గమనార్హం. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం విక్రయాల్లో 80 శాతం టాప్-10 టైర్ 2 పట్టణాలైన అహ్మదాబాద్, వదోదర, సూరత్, నాసిక్, గాంధీనగర్, జైపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, మోహాలిలో నమోదయ్యాయి.
ఈ పది పట్టణాల్లో 2023-24లో 1,68,998 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 1,51,706 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మిగిలిన 20 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో భోపాల్, లక్నో, గోవా, రాయిపూర్, విజయవాడ, ఇండోర్, కోచి, త్రివేండ్రం, మంగళూరు, గుంటూరు, భివాండి, డెహ్రాడూన్, లుధియానా, చండీగఢ్, ఆగ్రా, మైసూర్, సోనేపట్, పానిపట్, అమృత్‌సర్ ఉన్నాయి. టైర్`1 పట్టణాల కంటే టైర్ 2 పట్టణాల్లోనే ఇళ్ల మార్కెట్ పరంగా మెరుగైన పనితీరు నమోదైంది. దీనికి కారణం ధరలు తక్కువగా ఉండడంతోపాటు, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండడమే. ఈ చిన్న పట్టణాల్లోని మధ్య తరగతి వాసుల సొంతింటి కలను అందుబాటు ధరలు సాకారం చేస్తున్నాయి’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్ జసూజ తెలిపారు. చిన్న మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ), పరిశ్రమల ఏర్పాటుతో ఈ పట్టణాలు ఆర్థిక బూమ్‌ను చూస్తున్న ట్టు చెప్పారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు మద్దతునిస్తుండడం కూడా ఈ పట్టణాల్లో డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా టాప్ 30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గత ఆర్థిక సంవత్సరం నమోదైన ఇళ్ల విక్రయాల్లో 70 శాతం వాటా.. పశ్చిమాదినే ఉండడం గమనించొచ్చు. ఇక్కడి పట్టణాల్లో విక్రయాలు అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం పెరిగి 1,44,269 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని పట్టణాల్లో అధిక డిమాండ్ కనిపించింది. ఉత్తరాదిన విక్రయాలు 8 శాతం పెరిగి 26,308 యూనిట్లుగా ఉంటే, దక్షిణాదిన 8 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. తూర్పు, మధ్య భారత్‌లోని పట్టణాల్లో 18 శాతం అధికంగా 15,372 ఇళ్లు అమ్ముడయ్యాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరు తగ్గడం లేదు. అమ్మకాల్లో రికార్డులను సృష్టిస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూన్ క్వార్టర్‌లో హైదరాబాద్ మార్కెట్లో 15,085 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్లు 13,565 యూనిట్లతో పోల్చి చూస్తే 11 శాతం వృద్ధి కనిపించింది. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాలు 19,660 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 23 శాతం క్షీణత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి.
‘‘క్రితం త్రైమాసికంలో అధిక విక్రయాల బేస్ ఏర్పడినప్పడు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమే. అంతేకాదు ఈ స్థాయిలో విక్రయాలు తగ్గడానికి గడిచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయిన ప్రాపర్టీ ధరల ప్రభావం కూడా కారణమే. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా, చెన్నై, కోల్‌కతాలో తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే ఒక్క ఢల్లీి ఎన్‌సీఆర్‌లోనే అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో జూన్ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడు పోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఒక శాతం పెరగ్గా, మార్చి త్రైమాసికం నుంచి ఆరు శాతం వృద్ధి చెందాయి. ఎంఎంఆర్‌లో 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. బెంగళూరులో 16,360 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 9 శాతం అధికంగా నమోదయ్యాయి. పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నైలో 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యా యి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికం గణాంకా లతో పోల్చి చూస్తే 9 శాతం తక్కువ. కోల్‌కతాలో 20 క్షీణతతో ఇళ్ల అమ్మకాలు 4,640 యూనిట్లకు పరిమితమయ్యాయి.
8,000 ప్లాట్‌ల నిర్మాణం
గ్రేటర్ నోయిడా అథారిటీ ఐదు బిల్డర్ ప్లాట్‌ల కేటాయింపు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నగరంలో కనీస ఆదాయం రూ. 500 కోట్లు వస్తుందని, 8,000 కొత్త ఫ్లాట్ల నిర్మాణం నిర్మాణం జరుగుతుందని అంచనా వేస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో ఈ-వేలం ద్వారా కేటాయింపు జరుగుతుందని అధికారిక ప్రకటనలో అథారిటీ తెలిపింది. గ్రేటర్ నోయిడా అథారిటీ బిల్డర్ విభాగం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం మొత్తం 99,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వన్ ఎ, ఎంయూ, సిగ్మా 3, ఆల్ఫా 2, పై వన్ సెక్టార్లలో ప్లాట్లు ఉన్నాయి. గ్రేటర్ నోయిడాను ఆగ్రా, మథురలతో కలిపే యమునా ఎక్స్ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే (ఈపీఈ)తో ఈ సెక్టార్లకు మంచి కనెక్టివిటీ ఉందని అధికారులు తెలిపారు. ఈ సెక్టార్లు జెవార్‌లో రాబోయే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో కూడా అనుసంధానం కానున్నాయి. ప్లాట్ పరిమాణం, స్థలాన్ని బట్టి చదరపు మీటరుకు రూ.48,438 నుంచి రూ.54,493 వరకు ధర నిర్ణయించారు. రిజర్వ్ ధర ప్రకారం ఈ ఐదు భూముల మొత్తం ధర సుమారు రూ.500 కోట్లు. ప్లాట్ల కేటాయింపు ఈ-వేలం ద్వారా జరుగుతుంది.