Naa Anveshana: కంటెంట్ తక్కువ.. కాంట్రొవర్సీ ఎక్కువ..! నా అన్వేషణ – అన్వేష్‌పై కేసు..!!

ప్రముఖ తెలుగు యూట్యూబర్, ‘నా అన్వేషణ’ (Naa Anveshana) ఛానల్ యజమాని, ప్రపంచ యాత్రికుడిగా (Prapancha Yatrikudu) గుర్తింపు పొందిన అన్వేష్ (Anvesh) మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ మెట్రో రైల్‌లో బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రచారం వెనుక రూ.300 కోట్ల స్కామ్ జరిగిందంటూ తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, దాన కిశోర్, వికాస్ రాజ్‌లపై సంచలన ఆరోపణలు చేసిన వీడియోతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అన్వేష్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ 29న అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ‘ప్రపంచ యాత్రికుడు’లో ‘తెలంగాణ డీజీపీ మెట్రో స్కామ్ – 300 కోట్లు దోచేశారు’ అనే శీర్షికతో వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ఆయన, తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP Jithender) సహా పలువురు సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు హైదరాబాద్ మెట్రో రైల్‌లో బెట్టింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా రూ. 300 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఈ యాప్స్ ద్వారా రూ. 1,000 కోట్ల వ్యవహారాలు జరిగాయని, ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా భాగస్వాములని అన్వేష్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియా సెల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎ. నవీన్ కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అన్వేష్ ఆరోపణలు నిరాధారమైనవి, అవమానకరమైనవి, ప్రజల్లో అశాంతిని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, అన్వేష్‌పై కేసు నమోదైంది.
2.4 మిలియన్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు, 2 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో అన్వేష్ తన ప్రపంచ యాత్రల వీడియోలతో గతంలో బాగా పాపులర్ అయ్యారు. వివిధ దేశాల సంస్కృతులు, జీవనశైలిని హాస్యభరితంగా చూపించే ఆయన వీడియోలు అభిమానులను ఆకర్షించాయి. అయితే, ఇటీవల ఆయన బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాటం ప్రకటించి, ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన వీడియోలు వివాదాస్పదంగా మారాయి. మార్చి నెలలో సైబరాబాద్ పోలీసులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ వంటి సినీ నటులతో పాటు 19 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అన్వేష్ బెట్టింగ్ యాప్స్ పై తన ఛానల్‌లో వరుస వీడియోలు చేస్తూ వచ్చారు. అయితే, ఈ వీడియోల్లో ఆయన అధికారులపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అన్వేష్ తాజా వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో బెట్టింగ్ యాప్స్ పై అవగాహన కల్పించినందుకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వంటి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్న అన్వేష్, ఇప్పుడు నిరాధార ఆరోపణలతో తన విశ్వసనీయతను కోల్పోతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన వీడియోల్లో అసభ్య పదజాలం, అనవసర విమర్శలు పెరిగాయని, యాత్రల వీడియోలకంటే వివాదాస్పద కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.