KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో (Telangana Politics) సంచలనం సృష్టిస్తున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Kaleshwaram Project) అవకతవకల విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ను పిలిచిన సంగతి తెలిసిందే. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (Justice PC Ghosh Commission) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే జూన్ 6న మాజీ ఇరిగేషన్ మంత్రి టి.హరీష్ రావును (Harish Rao), జూన్ 9న మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను (Etela Rajendar) విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. ఈ నోటీసులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద సాగునీటి పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును కేసీఆర్ తన కలల ప్రాజెక్టుగా చెప్పుకున్నారు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ (Medigadda) బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో లీకేజీలు గుర్తించడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చిలో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నిర్మాణ లోపాలు, డిజైన్ లోపాలు, ఆర్థిక అవకతవకలు, నిర్వహణలో జరిగిన లోపాలపై విచారణ జరుపుతోంది.
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఈ నోటీసులను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల కోసం నిర్మించబడింది. కేసీఆర్ తెలంగాణ కోసం తన జీవితాన్ని అర్పించారు. ఈ విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్య అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు ఈ విచారణను సమర్థిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజల డబ్బును కేసీఆర్ ఫ్యామిలీ దుర్వినియోగం చేసిందని విమర్శిస్తున్నారు.
విచారణ కమిషన్ ఇప్పటికే ఇరిగేషన్, ఆర్థిక శాఖల అధికారులను, ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులను విచారించింది. అధికారులు చాలామంది నిర్మాణంలో లోపాలను అంగీకరించారని, కొందరు నిర్ణయాధికార ప్రక్రియల గురించి తమకు తెలియదని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌ల విచారణ కీలకంగా మారనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఇరిగేషన్ శాఖ అధికారులు కమిషన్‌కు తెలిపినట్లు సమాచారం.
2024 జూన్‌లో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై విచారణకు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ నోటీసులు జారీ చేసినప్పుడు.. కేసీఆర్ విచారణకు హాజరు కాకుండా జూలై 30 వరకు గడువు కోరారు. ఆ తర్వాత ఆ కమిషన్‌ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం కేసీఆర్ విచారణకు నేరుగా హాజరు కాకుండా లేఖ ద్వారా తన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా కేసీఆర్ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ విచారణకు హాజరైతే అది బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ హాజరు కాకపోతే దీనిని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే.. కాళేశ్వరం కమిషన్ విచారణ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా, లేక గతంలోలాగా లేఖ ద్వారా సమాధానం ఇస్తారా, లేక కోర్టుకు వెళతారా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.